యూట్యూబ్ అంటే తెలియని వారుండరు. వేడుకలు, పాటలు, వినోదం ఇలా ఏది కావాలన్నా వీడియోల రూపంలో అందిస్తుంది. ప్రస్తుతం ఇది ఎందరికో ఆదాయ వనరుగా మారింది. అనేక మంది యూట్యూబర్లు యూజర్లకు కావాల్సిన కంటెంట్ అందిస్తూ సబ్ స్క్రైబర్లను పెంచుకుంటున్నారు. అటు సబ్ స్క్రైబర్లు కూడా యూట్యూబ్ ఛానెళ్లను ఫాలో అవుతూ అందులోని పాత్రధారులతో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో బాగా పాపులర్ అయ్యారు క్రియేటివ్ థింక్స్ అడ్వెంచర్ యూట్యూబ్ ఛానెల్ ఓనర్ శ్రీ (సురేశ్). ఇతను కొన్ని రోజుల కింద మౌనిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి వీడియోను తన ఛానెల్ లో అప్ లోడ్ చేసి ‘కట్నాలు అందించేవాళ్లు అందించండి’ అని బహిరంగ పిలుపు ఇచ్చాడు. దీంతో శ్రీ కూడా ఊహించని విధంగా అతని సబ్ స్క్రైబర్లు స్పందించారు. ఇప్పటివరకు ఏకంగా రూ. 4.37 కోట్లను కట్నాల రూపంలో అందించారు.
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలుపుతూ ఇప్పటివరకు 23, 301 మంది సబ్ స్క్రైబర్లు కానుకలు అందించారని స్క్రీన్ షాట్ తీసి పెట్టాడు. అయితే సిగ్గు లేకుండా కట్నాలు అడగమేంటీ? అదీ ఓపెన్ గా! అని ఆశ్చర్యపోతున్నారా? ఇక్కడే ఉంది అసలు ట్విస్టు. కట్నాలు పంపమని అడిగిన శ్రీ.. అవి ఎలా పంపాలో కూడా చెప్పాడు. డబ్బు రూపంలో కాకుండా పెళ్లి వీడియో కింద కామెంట్ల రూపంలో ఎంత చదివించాలనుకుంటున్నారో చెప్పమని కోరాడు. దీంతో కామెంట్ చేయడం ఫ్రీయే కదా అని సబ్ స్క్రైబర్లు పెద్ద ఎత్తున స్పందించారు. మొత్తం 40 వేల మంది ఇలా కామెంట్ల రూపంలో ఇప్పటివరకు రూ. 4 కోట్ల 37 లక్షల 87 వేల 213 రూపాయలు చదివించారు. ఇదిలా ఉంటే పెళ్లికి వధువు కుటుంబం నుంచి శ్రీ ఒక్కరూపాయి కూడా వరకట్నం తీసుకోలేదు. పెళ్లి కూడా గుడిలో మామూలుగా హడావిడి లేకుండా చేసుకున్నాడు. దీంతో అభిమాన యూట్యూబర్ సింప్లిసిటీకి సబ్ స్క్రైబర్లు ఫిదా అవుతున్నారు. అటు తన భర్త చేసిన పనికి మౌనిక కూడా ఆశ్చర్యపోయింది.