సైన్స్, టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతున్నా కొన్ని వర్గాల ప్రజలు ఇంకా అభివృద్ధి ఫలాలకు ఆమడదూరంలోనే ఉన్నారు. అంతరిక్షంలోకి మూడు నెలలకో రాకెట్ పంపే మనదేశంలో కేవలం మౌలిక సదుపాయాలు లేక వేలమంది గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారు. అడవుల్లో సరైన రోడ్లు లేకపోవడంతో పేషంట్లను సకాలంలో ఆస్పత్రులకు తరలించడం కష్టంగా మారుతోంది. ఇక వరదలు వంటి ప్రకృతి విపత్తుల్లో నిత్యవసరాలు కూడా కష్టమే. గిరిజనులకు వైద్యసదుపాయం దిశగా ఏపీ ప్రభుత్వం కొత్త బైక్‌ను రూపొందించింది.
అడవుల్లో అంబులెన్సులు తిరగడం కష్టం కాబట్టి ‘బైక్ అంబులెన్స్’ను తయారు చేయించింది. ఇలాంటి బైక్‌లను రూపొందించడం ప్రపంచంలో ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. కాకినాడ జేఎన్టీయూ ప్రొఫెసర్, డిజైన్ ఇన్నోవేటివ్ సెంటర్ డైరెక్టర్ అల్లూరు గోపాలకృష్ణ దీన్ని డిజైన్ చేశారు. మొత్తం 108 బైక్ అంబులెన్సులను కొనడానికి ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. దీని ఖరీదు రూ. 4 లక్షలు. బజాజ్ ఎవెంజర్ బైక్‌కు పేషంట్ సీటును జోడించి దీన్ని తయారుచేశారు.
ఇవీ ప్రత్యేకతలు
ఈ బైకులు అడుగున్న రోడ్డు ఉంటే చాలు పేషంట్లను ఆస్పత్రులకు తరలిస్తాయి. ఎగుడు, దిగుడు ప్రాంతాల్లో సులువుగా బండి వెళ్లిపోతుంది. డ్రైవర్ వెనక ఉండే సీటును 90 డిగ్రీల కోణంలో రౌండుగా తిరిగే ఏర్పాటు ఉంటుంది. 110 డిగ్రీల వెనక్కి వాల్చొచ్చు. ఈ బైక్స్‌ను జీపీఎస్‌తో అనుసంధానించారు. పేషంట్ పరిస్థితిని, చుట్టుపక్కల వైద్యుసదుపాయాల గురించి తెలుసుకునే ఏర్పాట్లు ఉంటాయి.
ఇవి కూడా చదవండి :
ఏపీలో రిటైర్మెంట్ వయస్సు 65 ! వార్తలపై ప్రభుత్వం క్లారిటీ..
సీబీఐకి వైఎస్ అవినాష్ రెడ్డి లేఖ..విచారణకు హాజరవుతున్నట్టు వెల్లడి