రాజకీయ నాయకులపై, సినిమా హీరోలపై అభిమానుల్లో ఉండే క్రేజీని వర్ణించడానికి మాటలు చాలవు. పాలాభిషేకాలు, రక్తాభిషేకాలు, కొన్నిచోట్ల మద్యాభిషేకాలు సర్వసాధారణం. ఇక అభిమాన దేవుళ్ల బర్త్‌డేల సందర్భంగా చేసే హల్చల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. బుధవారం ఆంధప్రదేశ్‌లో పలుచోట్ల ఇలాంటి పిచ్చి పీక్స్ అభిమానాలు కనిపించాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 50వ జన్మదినం సందర్భంగా అభిమానులు భారీస్థాయిలో వేడకలు జరిపారు. పోస్టర్లు, బ్యానర్లు కట్టి ‘మళ్లీ జగనే అధికారంలోకి రావాలి’ అని నినాదాలు చేశారు.
కొందరైతే మరింత అభిమానం చాటుకోవడానికి అద్భుతమై క్రియేటివిటీ జోడించారు. నాలుగు రోజుల్లో క్రిస్మస్ రానుండడం, క్రైస్తవంతో జగన్ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయనను ఏసుక్రీస్తుతో పోల్చుతూ సోషల్ మీడియాలోనూ, బయటా ప్రచారం చేశారు. జగన్ ఫొటోలో ఏసుక్రీస్తుగా మార్చి భుజాలు దాటిన జుట్టుతో తీర్చిదిద్ది అభిమానం చాటుకున్నారు.ఒక బ్యానర్లో.. ‘‘నాడు ఏసుక్రీస్తు పాపుల కోసం ఈ లోకంలో జన్మిస్తే నేడు జగన్ ప్రజల కోసం ఈ లోకంలో జన్మించారు.. నాడు ఏసుక్రీస్తు పునీతురాలయిన మరియమ్మ తల్లిగర్భాన జన్మిస్తే నేడు జగన్ బాబు సర్ పునీతురాలైన పెద్దమ్మ విజయమ్మ తల్లి గర్భాన జన్మించారు,’’ అని వైనవైనాలుగా వర్ణించారు. జగన్ నీతిమంతుడని, దైవసమానుడని కొనియాడారు.