YS Sharmila criticized Minister Niranjan Reddy
mictv telugu

ఎవర్రా నీకు మరదలు.. మంత్రిపై షర్మిల ఫైర్

September 10, 2022

ఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిర్వహిస్తున్న ప్రజా ప్రస్థానం పాదయాత్ర శుక్రవారం వనపర్తి నియోజకవర్గంలో ప్రవేశించింది. ఈ నియోజకవర్గం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిది. ఈ సందర్భంగా గతంలో మంత్రి తనపై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ షర్మిల ఆయనపై మండిపడ్డారు. ‘నేను ప్రతీ మంగళవారం నిరుద్యోగుల కోసం నిరాహార దీక్షలు చేస్తుంటే.. ఈ నిరంజన్ రెడ్డి తనను మంగళవారం మరదలు అన్నారు. ఎవర్రా మరదలు.. సిగ్గుండాలి కదా. మెట్టు దెబ్బలు తింటారు జాగ్రత్త’అంటూ హెచ్చరించారు. అనంతరం ప్రజలనుద్దేశిస్తూ ‘పరాయి స్త్రీలో చెల్లిని, తల్లిని చూడలేని సంస్కార హీనుడు. ఈయనకు, కుక్కకు ఏమైనా తేడా ఉందా? నా పోరాటంలో ఈయనకు మరదలు కనిపించిందా’ అంటూ ఘాటుగా స్పందించారు. నిరంజన్ రెడ్డికి అధికార మదం తలకెక్కిందని, హమాలీ పనిచేసుకోవాలని నిరుద్యోగులకు చెప్తారా? అంటూ విరుచుకుపడ్డారు. తమరు మంత్రి పదవి వదిలేసి హమాలీ పని చేసుకోవచ్చు కదా అని సూచించారు. 150 ఎకరాల్లో ఫాం హౌస్ కట్టుకున్న నిరంజన్ రెడ్డి ఎంత అవినీతికి పాల్పడ్డాడో తెలుస్తోంది అంటూ ఆరోపించారు. కాగా, 2021 అక్టోబరులో నాగర్ కర్నూలులో ప్రసంగించిన మంత్రి నిరంజన్ రెడ్డి.. షర్మిలను మంగళవారం మరదలు అంటూ నోరు జారారు. అయితే తర్వాత విమర్శలు రావడంతో వెనక్కి తగ్గి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.