వైసీపీ గౌరవాధ్యక్షురాలు పదవికి విజయమ్మ రాజీనామా చేయడంపై వైఎస్సార్ తెలంగాణ అధ్యక్షురాలు షర్మిల సమాధానం దాటవేశారు. ఎక్కడో ఏదో జరిగిందని దానిపై ప్రశ్నలు వేయడం సబబు కాదని షర్మిల అన్నారు. ఇడుపులపాయలో.. వైఎస్సార్ ఘాట్ వద్ద విజయమ్మ, జగన్ను కలిశారు కాబట్టి పొరపచ్చాలు తొలగినట్లేనా అన్న ప్రశ్నకు.. షర్మిల అలాగే స్పందించారు. రాజశేఖరరెడ్డి వారసులు ఎవరన్న ప్రశ్నకు కూడా.. ఆమె జవాబు దాటవేశారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ మొదటి ఆవిర్భావోత్సవాన పార్టీ కార్యాలయంలో షర్మిల జెండా ఎగురవేసి…. వైస్సార్కు నివాళులు అర్పించారు.
ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ఆర్ స్మృతి వనం కోసం 20 ఎకరాలు కేటాయించాలన్నారు. కాంగ్రెస్ హయాంలో ఆనాటి సీఎం రోశయ్య.. ఐమ్యాక్స్ వద్ద స్థలం ఇస్తామన్నారని గుర్తు చేశారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని చెప్పారు. ఎన్నికలకు 6 నెలల ముందు రాజకీయ సమీకరణాలు మారతాయని, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆమె అన్నారు.