YS Sharmila protest In Hyderabad
mictv telugu

షర్మిలకు ఏమైంది?ఎందుకీ రచ్చ?

November 29, 2022


హైదరాబాద్‌లో రోడ్డుపై మధ్యలో వాహనం ఆగితే చాలు…క్షణాల్లో కిలోమీటర్ల కొద్దీ జామ్ అవుతుంది.అదే ఓ పార్టీ నేత వచ్చి ధర్నాకు దిగితే..అదీ కార్లతో..ఇక అంతే.. ఎక్కడి వాహనాలు అక్కడే. దాడి జరిగింది నిజమే. వాహనాలు ధ్వంసం అయింది వాస్తవం. వీటిని చూపించడానికి ప్రగతిభవన్ వైపు తీసుకురావడమే అభ్యంతరం. కంప్లయింట్ చేస్తే పోలీసులే చూసుకుంటారు. కేసు నమోదు చేసి నిందితుల్ని అరెస్టు చేస్తారు. ఒకవేల అలా చేయకపోతే ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించవచ్చు. కానీ ఇవన్నీ ఏం చేయకుండా రోడ్డెక్కేశారు. ప్రగతి భవన్ దారిలో రచ్చ రచ్చ చేశారు. సోమాజీగూడలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించారు.

 

వరంగల్ టు హైదరాబాద్
వరంగల్‌ జిల్లాలో కారవాన్‌కు నిప్పటించారు.హైదరాబాద్‌లో షర్మిల రచ్చ రచ్చ చేశారు. ప్రగతిభవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు.తగులబడిన వాహనాన్ని తీసుకొచ్చారు. స్వయంగా డ్రైవర్ చేసుకుంటూ షర్మిల వచ్చారు. సీఎం కేసీఆర్‌కు చూపించేందుకు తీసుకెళ్తున్నామన్నారు. నిజమే కానీ..ఇది హైదరాబాద్. అసలే ట్రాపిక్ జామ్. బిజీ టైమ్. ఈ టైమ్‌లో వస్తే వాహనదారుల పరిస్థితి ఏంటి?గంటలకొద్దీ ట్రాఫిక్‌లో నరకం చూడాల్సిందేనా? కారు దిగకుండా,అద్దాలు కిందకు దించకుండా ఉన్న షర్మిలను పోలీసులు కారుతో సహా లిఫ్ట్ చేశారు.క్రేన్ సాయంతో ఆమెని తరలించారు.ఈ సమయంలో కారులోనే షర్మిల కూర్చుండిపోయారు. ఎస్సార్ నగర్ స్టేషన్‌కు పోలీసులు తరలించారు.

షర్మిల వెర్షన్
“సోమవారం టీఆర్ఎస్ గూండాలు నా వాహనాలపై దాడి చేశారు. వాటిని సీఎం కేసీఆర్‌కు చూపించడానికే ప్రగతిభవన్ తీసుకెళ్తున్నా. పోలీసులు నన్ను అడ్డుకోవడం అన్యాయం. మహిళా నేతలపై దాడులు చేస్తారా? ఇదేం ప్రజాస్వామ్యం.ఇది అడిగేందుకు ప్రగతిభవన్ కు వెళ్తున్నా.సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలి”అని షర్మిల అన్నారు.

వాహనదారుల కష్టాలు
సోమాజిగూడలో దాదాపు గంటసేపు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఓ పార్టీ అధ్యక్షురాలు అయ్యి ఉండి ఇలా చేయడం ఏంటని వాహనదారులు వాపోతున్నారు. ట్రాపిక్‌కు అంతరాయం లేకుండా నిరసనలు తెలుపాలని అంటున్నారు.