వైఎస్ఆర్టీపీ ఆధ్యక్షురాలు షర్మిల చేసిన ‘కొజ్జా’ వ్యాఖ్యలపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. షర్మిల అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా హిజ్రాలు ఆందోళన చేపట్టారు. షర్మిల క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హిజ్రాల నిరసనలతో షర్మిల దిగొచ్చారు. బహిరంగంగా వారికి క్షమాపణలు తెలిపారు. “హిజ్రాలను అవమానించాలని వైఎస్సార్ బిడ్డకు లేనే లేదు. మనోభావాలు దెబ్బ తిని ఉంటే.. బేషరతుగా నా హిజ్రా అక్కచెల్లెల్లకు క్షమాపణలు చెప్తున్నాం” అని వెల్లడించారు. శంకర్ నాయక్ వ్యాఖ్యలను తిప్పికొట్టే క్రమంలో అలా అనాల్సి వచ్చిందని సంజాయిషీ ఇచ్చారు.
ఆ సమయంలో కూడా సమాజంలో హిజ్రాలకు గౌరవం ఉంది కానీ…శంకర్ నాయక్‌కు లేదని చెప్పినట్లు వివరించారు.కేసీఆర్ ప్రభుత్వం హిజ్రాలకు ఏం న్యాయం చేసిందని ప్రశ్నించారు ? డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారా అని నిలదీశారు. వైఎస్ఆర్టీపీ ప్రభుత్వం వచ్చాక వైఎస్ఆర్ బిడ్డగా హిజ్రాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు..సున్నా లేదా పావలాకే రుణాలు ఇచ్చి ఎవరి కాళ్ళ వాళ్లు నిలబడేట్లు చేస్తామని మాట ఇచ్చారు.
షర్మిల తన పాదయాత్రలో భాగంగా మహబూబాబాద్‌లో స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై ధ్వజమెత్తారు. ఆయన్ను ట్రాన్స్‌జెండర్లతో పోలుస్తూ చేసిన విమర్శలపై వివాదం చెలరేగింది. షర్మిల వ్యాఖ్యలపై శంకర్ నాయక్ అనుచరులతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు షర్మిల పాదయాత్రకు ఇచ్చిన అనుమతిని రద్దు చేశారు.