వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రగతి భవన్ ముట్టడికై మంగళవారం మధ్యాహ్నం.. నిన్న టీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేసిన తన కారులో బయల్దేరగా పోలీసులు మార్గమధ్యలోనే అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పీఎస్కు తరలించారు. కాగా కూతురు అరెస్ట్ విషయం తెలుసుకున్న వైఎస్ విజయమ్మ.. ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్కు బయల్దేరగా ఆమెనూ పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్ విజయమ్మను ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్కు రానీయకుండా ఇంటి వద్దే పోలీసులు అడ్డుకున్నారు.
లోటస్ పాండ్ లోని ఆమె ఇంటి వద్దే పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆమెను పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా లోటస్ పాండ్ లో పోలీసులతో విజయమ్మ తీవ్ర స్థాయిలో వాగ్వివాదానికి దిగారు. తన కుమార్తెను చూసేందుకు వెళితే మీకొచ్చిన ఇబ్బందేమిటని ఆమె పోలీసులను నిలదీశారు. రాష్ట్రమంతటా పార్టీ కార్యకర్తలతో నిరసనలు చెయ్యాలా? అని ప్రశ్నించారు. తాము కూడా రాష్ట్రాన్ని పాలించామని చెబుతూ.. మేం పోలీసులను చూడలేదా? ప్రభుత్వాలను నడపలేదా? అని అన్నారు. అయినప్పటికీ పోలీసులు వెనక్కు తగ్గకపోవడంతో… పోలీసుల చర్యను నిరసిస్తూ విజయమ్మ తన ఇంటిలోనే నిరాహార దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా పోలీసుల ఎదుటే ఆమె దీక్షకు దిగారు. దీంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ప్రస్తుతం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్న షర్మిలను సాయంత్రం దాకా పోలీసులు తమ అదుపులోనే ఉంచుకోనున్నారు.