ఊహించినట్టే వైఎస్ విజయమ్మ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. ఇకపై తన కూతురు, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలైన షర్మిలకు సాయంగా తెలంగాణలో ఉంటానని చెప్పారు. గుంటూరులో జరుగుతున్న వైకాపా ప్లీనరీలో ఆమె ఈ ప్రకటన చేశారు. విమర్శలు రాకుండా ఈ నిర్ణయం తీసుకున్నానని, తనను మన్నించాలని కోరారు.
‘‘నా కొడుకు జగన్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉన్నాను. ఇక అతణ్ని మీ చేతుల్లో పెడుతున్నాను. అతనికి ఇకముందూ మద్దతుగా నిలబడతాను. షర్మిల తన తండ్రి ఆశయాల సాధన కోసం తెలంగాణలో వైఎస్సార్టీపీ పెట్టుకుని ఒంటరిగా పోరాడుతోంది. ఆమెకు అండగా నిలబడకపోతే అన్యాయం చేసినదాన్ని అవుతాను. మా కుటుంబంలో గొడవలు ఉన్నాయని ఏవేవో ఆరోపణలు వస్తున్నాయి. విమర్శలకు అవకాశం ఇవ్వకుండా రాజీనామా చేస్తున్నా’’ అని ఆమె చెప్పారు. కాగా, జగన్ను పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్న నేపథ్యంలో విజయమ్మ రాజీనామా చేయడం గమనార్హం.