మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు గజ్జల ఉమాశంకర్ రెడ్డి భార్యకు బెదిరింపులు ఎదురయ్యాయి. చంపేస్తామంటూ కొందరు వ్యక్తులు బెదిరించినట్లు ఉమాశంకర్ రెడ్డి భార్య స్వాతి వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం కసునూరు పరమేశ్వర్ రెడ్డి, ఆయన కొడుకు తమ ఇంటి వద్దకు వచ్చి వార్నింగ్ ఇచ్చారని తెలిపారు. ఉమాశంకర్ రెడ్డి జైలు నుంచి రాగానే.. వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసినట్టుగానే చంపేస్తామంటూ బెదిరించారని ఆమె ఆరోపించారు. తన ఫోన్ లాక్కొని కిందకు కొట్టేశారని వాపోయారు.చెప్పుతో సైతం దాడిచేశారని తెలిపారు. భయంతో ఇంట్లోకి వెళ్ళి దాక్కున్నట్లు పేర్కొన్నారు.అనంతరం చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చినట్లు వెల్లడించారు. ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేసానని తెలిపారు. తమ కుటుంబంలో ఎవరికి ఏమైనా పరమేశ్వర్ రెడ్డిదే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
మరోవైపు వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ దూకుడు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విచారణకు రావాలని మరోసారి నోటీసులు ఇచ్చింది. గత నెలలో ఆయనను సీబీఐ రెండుసార్లు విచారణ చేయగా నేడు మరోసారి హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో మార్చి 6న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. కడప జిల్లా పులివెందులలోని వైఎస్ అవినాష్ రెడ్డి నివాసానికి వెళ్లి సీబీఐ అధికారులు వారికి నోటీసులు ఇచ్చారు. అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డికి కూడా సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. వైఎస్ అవినాష్‌ను పదేపదే విచారణకు పిలవడం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రేపు ఆయనను అరెస్ట్ చేస్తారనే అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.