మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరోసారి విచారణకు రావాల్సిందిగా వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు జారీచేశారు. పులివెందులలోని అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు అందజేశారు. సోమవారం(మార్చి 6) రోజున విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని తెలిపారు. అయితే ఈ నోటీసులపై స్పందించిన అవినాష్ రెడ్డి.. తాను సోమవారం విచారణకు రాలేనని అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులకు రిప్లై ఇచ్చారు. అయితే 6 వ తేదీ కచ్చితంగా విచారణకు రావాల్సిందేనని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు.
మరోవైపు ఈ కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా సీబీఐ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 12న విచారణకు హాజరుకావాల్సిందిగా భాస్కర్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు జారీచేయగా.. తాజాగా ఈ నెల 6వ తేదీనే విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులకు ఆయనకు సూచించారు. కడపలోనే విచారణకు హాజరుకావాల్సిందిగా తెలిపారు.