మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే సీబీఐ అధికారులు వైసీపీ ఎంపీ అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న విచారణకు రావాలని నోటీసుల్లో కోరింది. కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లేదా హైదరాబాద్‌లోని సీబీఐ ఆఫీసులో తమ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ గతంలో నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 23న విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. అయితే తాను 23వ తేదీన విచారణకు హాజరుకాలేనని భాస్కర్ రెడ్డి సీబీఐ అధికారులకు సమాచారం అందజేశారు. అయితే ఫిబ్రవరి 25వ తేదీన కూడా విచారణ నిమిత్తం వైఎస్ భాస్కర్‌రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసినట్టుగా ప్రచారం జరిగింది. అయితే తనకు సీబీఐ నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని భాస్కర్ రెడ్డి వెల్లడించారు. ఇక, తాజాగా ఈ నెల 12న విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు వైఎస్ భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీచేశారు.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రెండుసార్లు అవినాశ్ రెడ్డిని సీబీఐ విచారించింది. ఇటీవలే సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతి పీఏ నవీన్‌లను కడప సెంట్రల్ జైల్‌లో విచారించారు. అవినాష్, ఇతరులు ఇచ్చిన సమాచారం ఆధారంగా భాస్కర్‌రెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా వివేకా హత్య కేసులో రూ.40 కోట్ల డీల్‌పై విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.