వివేకా హత్య.. ఇద్దరు మహిళల నుంచి కీలక సమాచారం! - MicTv.in - Telugu News
mictv telugu

వివేకా హత్య.. ఇద్దరు మహిళల నుంచి కీలక సమాచారం!

September 26, 2020

nmvm

గతేడాది మార్చి నెలలో హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణను సీబీఐ వేగవంతం చేసింది. సీబీఐ విచారణలో రోజు రోజుకు తెరపైకి కొత్త కొత్త వ్యక్తులు వస్తున్నారు. అన్ని కోణాల్లో ఈ కేసును సీబీఐ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రెండో విడత విచారణలో భాగంగా వారం రోజుల నుంచి పలువురు అధికారులను  ప్రశ్నించారు. వారి నుంచి కీలక ఆధారాలు కూడా సేకరించారు. తాజాగా కడపకు చెందిన ఇద్దరు ముస్లిం మహిళలు, పులివెందులకు చెందిన బాబును సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వారితో వివేకానందరెడ్డికి ఉన్న ఆర్థిక లావాదేవీలు, ఇతర విషయాలపై ప్రశ్నించినట్లు సమాచారం. ఈ ఇద్దరు మహిళల్లో పులివెందులకు చెందిన చెప్పుల వ్యాపారి మున్నా రెండో భార్య ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు మహిళలతో పాటు మున్నా చెప్పుల షాప్‌లో పనిచేస్తున్న భాస్కర్ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు విచారించారు. 

ఇప్పటికే పలుమార్లు మున్నా నుంచి కీలక వివరాలు రాబట్టారు. కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్‌లో సీబీఐ అధికారులు ఈనెల 20న మొదటిసారిగా మున్నాను ప్రశ్నించారు. అనంతరం ఆయన బ్యాంకు ల్యాంకరులో భారీ మొత్తంలో ఉన్న నగదు గుర్తించిన సీబీఐ అధికారులు.. గత మూడు రోజులు క్రితం మున్నాను అదుపులోకి తీసుకున్నారు. ఈ విచారణలో మున్నా నుంచి మరింత సమాచారాన్ని రాబట్టారు. మరోవైపు వివేకా ఇంట్లో పనిచేస్తున్న రాజశేఖర్‌ను సీబీఐ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. హత్య జరిగిన రోజు, ఆ ముందు రోజు ఏం జరిగిందో ఆరా తీశారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన నాటి ముందురోజు కాణిపాకం ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ఆయనను ప్రశ్నించారు.  కేసు విచారణ ముమ్మరం చేయడానికి, అనుమానితులను వరసగా విచారణ చేయడానికి ఎక్కువ సంఖ్యలో అధికారులు రంగంలోకి దిగనున్నారు.