అభిమానం పీక్స్‌కు.. వైఎస్సార్ కాంగ్రెస్ శ్మశానాలు..  - MicTv.in - Telugu News
mictv telugu

అభిమానం పీక్స్‌కు.. వైఎస్సార్ కాంగ్రెస్ శ్మశానాలు.. 

September 13, 2019

Ysr congress activists paints party colors to grave yard

మనది ప్రజాస్వామ్య వ్యవస్థ. ఏ పార్టీ అయినా, ఎంత భారీ మెజారిటీతో గెలిచినా అధికారంలోకి ఉండేది ఐదేళ్లే. జనం మెచ్చితే మళ్లీ పట్టం కడతారు. నచ్చకపోతే విపక్షంలో కూర్చోబెడతారు. ఈ సత్యం మన పార్టీలకు, నాయకులకు, కార్యకర్తలకు తెలిసినా కొందరు అత్యుత్సాహంతో ప్రజాస్వామ్యాన్ని కాస్తా రాచరిక వ్యవస్థగా మార్చేస్తుంటారు. ఏ పార్టీ కూడా దీనికి అతీతం కాదు. ఏపీలో వైస్సార్ కాంగ్రెస్ రంగులు వేసుకున్న శ్మశానమే దీనికి తాజా ఉదాహరణ. 

జగన్ మోహన్ రెడ్డి పాలనకు 100 రోజులు పూర్తయిన సందర్భంగా వైకాపా కార్యకర్తలు వేడుకలు చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి మాచర్ల వెళ్లే రోడ్డు పక్కన ఉన్న ఓ శ్మశానాన్ని కూడా ఇందులో భాగం చెయ్యాలనుకున్నారు. శ్మశానం గోడలకు, ద్వారానికి పార్టీ రంగులను పూయించారు. దీంతో ఆ వల్లకాడు కొత్త కళ సంతరించుకుంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ’చివరకు శ్మశాన వాటికను కూడా వదిలిపెట్టరా? శ్మశాన వాటిక గోడలకు వైసీపీ రంగులా? పల్నాడులో శ్మశానం గోడకు, చిన్న గదికి, ఆర్చ్‌కు కూడా వైసీపీ రంగులు వేస్తారా? దేన్నీ మీరు వదలరా?” అని టీడీపీ నేత కేశీనేని నాని మండిపడ్డారు. అయితే టీడీపీ నేతలు ఈ విమర్శలను ఏమాత్రం ఖాతరు చెయ్యడం లేదు. గతంలో టీడీపీ చాలా వాటికి పచ్చరంగు వేసిందని, తాము చేసింది తప్పేమీ కాదని సమర్థించుకుంటున్నారు.