సీఎం గారూ.. మీరు తప్పకరావాలి.. కేసీఆర్‌తో జగన్ - MicTv.in - Telugu News
mictv telugu

సీఎం గారూ.. మీరు తప్పకరావాలి.. కేసీఆర్‌తో జగన్

May 25, 2019

ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్‌లో సందడి చేశారు. రాజ్ భవన్, ప్రగతి భవన్ ప్రాంతాలు జయహో జగన్, జైజై జగన్ నినాదాలతో హోరెత్తాయి. తెలంగాణలోని వైఎస్ బిడ్డ అభిమానులు పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతాలకు చేరుకుని సంబరాలు చేసుకున్నారు.

Ysr congress leader would be chief minister of andra Pradesh jagan mohan reddy

ఏపీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన తమ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని జగన్.. రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలసి విన్నవించారు. సంఖ్యాబలాన్ని నిరూపించే పత్రాలను అందజేశారు. తర్వాత నేరుగా ప్రగతి భవన్ చేరుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఆయన వెంట భార్య భారతి, వైసీపీ నేతలు విజసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు తదితరులు ఉన్నారు.

జగన్‌ను కేసీఆర్ దంపతులు, కేటీఆర్ దంపతులు, తెలంగాణ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు సాదరంగా ఆహ్వానించారు. వెండి వీణను బహూకరించారు. కేసీఆర్ జగన్‌కు స్వీటు తినిపించి, శాలువా కప్పి సన్మానించారు. ‘మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది’ అని అభినందించారు. ఈ నెల 30న విజయవాడలో సీఎంగా తాను ప్రమాణ స్వీకారం చేస్తున్నానని, ఆ కార్యక్రమానికి తప్పకుండా రావాలని జగన్.. కేసీఆర్‌ను కోరారు. అందుకు కేసీఆర్ సమ్మతించినట్లు సమాచారం. ఇద్దరూ కాసేపు కొన్ని అంశాలపై చర్చలు జరిపారు. రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలని, ఏపీ, తెలంగాణ విషయాల్లో కలిసి పనిచేయాలనే అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ అధికార హోదాల్లో కలుసుకుని చర్చించడం ఇదే తొలసారి.