ఢిల్లీ లిక్కర్ కుంభం కోణం నిందితులు విచారణ నుంచి తప్పించుకోడానికి నానా తంటాలూ పడుతున్నారు. అరెస్టయిన వాళ్లు బెయిళ్ల కోసం తిప్పలు పడుతుంటే నిందితులు, అనుమానితులు ఇంటరాగేషన్‌కు ముఖం చాటేస్తున్నారు. అనుమానితురాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తన పిటిషన్ సుప్రీం కోర్టులో పెండింగులో ఉండడంతో రాలేననని చెప్పడం తెలిసిందే. శనివారం హాజరు కావాల్సిన వైకాపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కూడా విచారణకు డుమ్మా కొట్టారు. ఆయన ఈ ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండింది. అయితే నాలుగువుతున్నా ఆయన అక్కడికి చేరుకోలేదు.
విచారణకు రావడం లేదన్న సమాచారాన్నీ ఈడీకి పంపలేదు. మాగుంట ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఈ కేసులో ఆయన కొడుకు రాఘవరెడ్డిని ఈడీ అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈడీ విచారణకు వెళ్తే అరెస్ట్ చేస్తారమే భయంతోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి గైర్హాజరయ్యారని వార్తలు వస్తున్నాయి. ఈ స్కాంలో ఈడీ పక్కా ఆధారాలు సేకరించి విచారణంలో నిందితుల, అనుమాతుల ముందుంచి ప్రశ్నల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే.
లిక్కర్ కేసుతో తనకు సంబంధం లేదని మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెబుతున్నారు. అయితే ఢిల్లీలో మాగుంట కుటుంబం మందు అమ్ముకుంటూ, అక్రమాలకు పాల్పడుతోందని దర్యాప్తు సంస్థల అనుమానం. తమ బంధువులకు ఢిల్లీలోని 32 జోన్లలో మద్యం వ్యాపారాలున్న మాట నిజమేనని, ఈడీ ఇప్పటికే అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చామని మాగుంట చెబుతున్నారు. అయితే లిక్కర్ పాలసీ రూపకల్పనలోనే స్కాం జరిగిందని, వ్యాపారులు సిండికేట్ అయ్యి ఆప్ నేతలకు లంచాలిచ్చి లైసెన్సులు పొందారని ఈడీ, సీబీఐల దర్యాప్తుల్లో తేలుతోంది.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఢిల్లీ వెళ్లడాన్ని కొందరు అవినాశ్ రెడ్డి కోణంతోపాటు మాగుంట కోణంలోనూ చూస్తున్నారు. వివేకా హత్యకేసులో అవినాశ్ రెడ్డి, లిక్కర్ కేసులో మాగుంట అరెస్ట్ కాకుండా జగన్ ఢిల్లీలో చక్రం అడ్డేస్తున్నారని, ఈమేరకు మోదీ, అమిత్ షాలతో మంతనాల కోసమే హస్తిన వెళ్లారని వార్తలు వస్తున్నాయి.