తన మాజీ అనుచరులతో ప్రాణహాని ఉందని తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవలి శ్రీదేవి ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ నుంచి సస్పెన్సన్‌కు గురైన నలుగురు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు కూడా చేశారు.
చలివేంద్రపు సురేష్, శృంగారపాటి సందీప్, మరో ఇద్దరు గతంలో తనకు అనుచరులుగా ఉన్నారని ఆమె తెలిపారు. సుందీప్, సురేశ్‌లను క్రమశిక్షణ ఉల్లంఘనపై పార్టీ నుంచి సస్పెండ్ చేశారని, తర్వాత వారు తనపై కక్ష గట్టారని ఎమ్మెల్యే ఆరోపించారు. ‘సురేష్, సందీప్ ఫోన్లలో బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరిస్తున్నారు. వారిద్దరూ మద్యం అమ్ముకుంటూ, పేకాట ఆడిస్తూ పోలీసులకు దొరికారు. అందుకే వారిని వైసీపీ మండల పార్టీ నాయకులు పార్టీ నుంచి బహిష్కరించారు..’ అని వివరించారు. వారు సోషల్ మీడియాలో తనపై బురద జల్లుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.