చిక్కుల్లో జగన్ పార్టీ.. గుర్తింపు రద్దు కోసం వైఎస్సార్ పార్టీ పిటిషన్ - MicTv.in - Telugu News
mictv telugu

చిక్కుల్లో జగన్ పార్టీ.. గుర్తింపు రద్దు కోసం వైఎస్సార్ పార్టీ పిటిషన్

July 10, 2020

YSRCP

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ చిక్కుల్లో పడింది. ఆయన నేతృత్వంలోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అన్నా వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఈ పిటిషన్ దాఖలు చేశారు. జులై 13న ఈ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఇటీవల ఎన్నికల సంఘానికి కూడా మహబూబ్ భాషతో పాటు అన్నా వైఎస్ఆర్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ ఫిర్యాదు చేశారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి బదులు వైఎస్ఆర్ పేరును ఉపయోగించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు వినతి పత్రం అందించారు. అయితే తమ అభ్యర్థనపై ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తాము న్యాయ పోరాటానికి సిద్ధమయ్యామని మహబూబ్ బాషా చెప్పారు. 

అధికార బలం, డబ్బు బలంతో జగన్ పార్టీ నాయకులు దౌర్జన్యంగా తమ పార్టీ పేరును వాడుకుంటున్నారని ఆరోపించారు. దీంతో నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిన తమ పార్టీ నాయకులు కార్యకర్తలు అయోమయానికి గురి అవుతున్నారని తెలిపారు.
కాగా, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా గతంలో ఈ పేరుపై అభ్యంతరాలు వ్యక్తంచేశారు. పార్టీ తరఫున షోకాజ్ నోటీస్ పంపిన జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిపై ఘాటుగా విమర్శలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ నోటీస్ ఎలా ఇస్తారని నిలదీశారు.