‘‘తెలంగాణలో తాలిబాన్ పాలన కొనసాగుతోంది. అవినీతి పెరిగిపోయింది. కేసీఆర్ వైఫల్యాలను ఎండగట్టి తీరతాను, వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఎవరూ ఆపలేరు’’ అని తేల్చిచెప్పారు వైఎస్ షర్మిల. పాదయాత్రకు ఆటంకాలు, టీఆర్ఎస్తో గొడవల నేపథ్యంలో ఆమె శుక్రవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాయలంలో కార్యకర్తలు, నేతలతో మంతనాలు జరిపారు. పాదయాత్రకు ఆటంకాలను ఎలా ఎదుర్కోవాలో చర్చించారు. ‘‘ఆగిన చోట నుంచి మళ్లీ పాదయాత్ర ఉంటుంది. ఈ నెల 4న వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని లింగగిరి గ్రామం నుంచి 14 వరకు యాత్ర నిర్వహిస్తాం’’ అని తెలిపారు. ఎవరెన్ని దాడులు చేసినా, కొట్టినా, చంపినా బెదిరే ప్రస్తకే లేదన్నారు. సమావేశం తర్వాత ఆమె డీజీ జితేందర్ రెడ్డిని ఆయన కార్యాలయంలో కలసి పాదయాత్ర వివరాలు అందించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు.
‘‘నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు. కేసీఆర్ బిడ్డ లిక్కర్లో, కొడుకు రియల్ ఎస్టేట్‌లో దోచుకుంటున్నారు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగే వరకు నా పోరాటం ఆగదు. నా పాదయాత్రను అడ్డుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. నేను ఆంధ్రా అని కావాలనే నిందిస్తున్నారు. నేను తెలంగాణ కోడలిని, తెలంగాణ పేరుతోనే పార్టీ పెట్టుకున్నాను’’ అని షర్మిల అన్నారు.