రైతుల సంక్షేమం కోసం చాలా చేస్తున్నామని చెబుతున్న కేసీఆర్ ప్రభుత్వం వాస్తవానికి చేసిందేమీ లేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. కేసీఆర్ పాలనలో ఇప్పటివరకు 9వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవాలు తెలుసుకోవడానికి ఆయనకు కంటి పరీక్షలు చేయించాలని, కరెండు షాక్ ఇవ్వాలని దుమ్మెత్తిపోస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఏ సంవత్సరం ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న వివరాలతో ఓ జాబితా కూడా ఇచ్చారు.
కేసీఆర్ కిసాన్ బర్ బాదీ. రైతు ఆత్మహత్యలపై పచ్చి అబద్ధాలు మాట్లాడుతుండు. దొర గారి పాలనలో దాదాపు 9వేల రైతులు బలవన్మరణం చెందినా, ఆ లెక్కలు కంటికి కనిపించడం లేదు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ అని రైతులను మోసం చేస్తుండు. మహానేత వైయస్ఆర్ పథకాలన్నీ బంద్ పెట్టి, పబ్బం గడుపుతుండు. pic.twitter.com/1X7Iyn20V5
— YS Sharmila (@realyssharmila) January 28, 2023
‘‘దొర ఏలుబడిలో 5987 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రికార్డులకు ఎక్కని ఆత్మహత్యలు మరో మూడు వేలు ఉన్నాయి.. దేశ రాజకీయల కోసం దొరగారు రైతు ఆత్మహత్యలపైన అబద్ధాలు పలకడం సిగ్గుచేటు. నోరు తెరిస్తే అబద్దాలేనని మరోసారి నిరూపించుకున్నందుకు కేసీఆర్¡కు ధన్యవాదాలు. తెలంగాణను అప్పుల, ఆత్మహత్యల తెలంగాణగా మార్చిన కేసీఆర్ రైతుల గురించి మాట్లాడే అర్హత కోల్పోయాడు’ అని షర్మిల ఘాటుగా విమర్శించారు. ‘‘ఆ లెక్కలు దొర కంటికి కనిపించడం లేదు. ఏటా ఎన్సీఈఆర్బీ ఆత్మహత్యల గణాంకాలు విడుదల చేస్తున్నా దొరగారికి నెత్తికెక్కడం లేదు. ముఖ్యమంత్రి గారికి కంటి పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. అవసరం అయితే ఎర్రగడ్డలోనూ టెస్టులు చేసుకోవాలి. మతితప్పి మాట్లాడుతున్న కేసిఆర్‌కు రైతులు ఆత్మహత్యలు ఎక్కడ కనిపిస్తాయి?” అని ఆక్షేపించారు. రాష్ట్రంలోని రైతులకు ఐదు గంటలు మాత్రమే కరెంటు ఇస్తున్నారని, కరెంటు విషయాలు బయటికి రావాలంటే సీఎం మెదడుకు కరెంటు షాక్ ఇవ్వాలని అన్నారు.