ఈ ఉద్యోగాలు మా పార్టీ పోరాట విజయమే.. షర్మిల - MicTv.in - Telugu News
mictv telugu

ఈ ఉద్యోగాలు మా పార్టీ పోరాట విజయమే.. షర్మిల

March 9, 2022

22

తెలంగాణ సీఎం కేసీఆర్ తమ పార్టీ పోరాటానికి దిగి వచ్చి, ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేశారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు. కేసీఆర్ మాట నిలబెట్టుకునేవరకు తమ పోరాటం సాగుతుందని ఆమె ప్రకటించారు. ‘మేం పార్టీ పెట్ట‌క‌ముందే 3 రోజుల పాటు ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాలంటూ నిరాహార దీక్ష‌లు చేశాం. పార్టీ పెట్టాక ఏకంగా 17 వారాల పాటు నిరాహార దీక్ష‌లు చేప‌ట్టాం. పోరాటాలకు ఎంతటి నియంత పాలకులైనా తలవంచాల్సిందే. ఈరోజు కేసీఆర్‌ గారి ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రకటన, వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ విజయం. ఇది వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ కార్యకర్తల విజయం. మేము పోరాటం చేస్తేనే ప్రతిపక్షాలకు సోయి వచ్చింది. అధికారపక్షానికి బుద్ధి వచ్చింది. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పే అలవాటున్న మీరు.. ఈరోజు మళ్లీ అబద్ధాలు చెప్పారు. రాష్ట్రంలో లక్షా 91వేల ఉద్యోగాల ఖాళీలుంటే, కేవలం 80వేల ఉద్యోగాలే భర్తీ చేస్తానంటున్న కేసీఆర్‌ గారు.. మీరు ఇవి కూడా నింపుతారనే గ్యారెంటీ లేదు. నోటిఫికేషన్లపై మాట ఇచ్చినంత మాత్రాన మా పోరాటం ఆగిపోదు. ఖాళీలు పూర్తి స్థాయిలో భర్తీ చేసేవరకు మా పోరాటం సాగుతూనే ఉంటుంది. లక్షా 91వేల ఉద్యోగ ఖాళీలు నింపేవరకు, నిరుద్యోగుల పక్షాన మేము పోరాటం చేస్తూనే ఉంటాం. మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాం” అంటూ ఆమె ట్వీట్లు చేశారు.