పీకే పవర్ చూపించడు.. లోకేష్ నోరు విప్పడు - MicTv.in - Telugu News
mictv telugu

పీకే పవర్ చూపించడు.. లోకేష్ నోరు విప్పడు

April 1, 2022

bochaaa

ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా ఇంటింటికీ అగ్గిపెట్టె, కొవ్వొత్తి పంపిస్తానని ప్రకటించిన లోకేష్‌పై వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచితే లోకేష్ నోరు విప్పడే.. భయపడుతున్నాడా? జనసేన అధినేత పవన్ కల్యాణ్ పవర్ స్టార్ కదా. మరి పవర్ చూపించడే? రేపు ఉగాది. గత మూడేళ్లుగా చంద్రబాబుకు పచ్చడిలోని చేదు రుచి మాత్రమే తెలుస్తుంద’ని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలోనే విద్యుత్ రేట్లను పెంచినట్టు తెలిపారు. దీని వల్ల కేవలం రూ. 1400 కోట్లు మాత్రమే భారం పడుతుందని, కానీ, టీడీపీ నేతలు మాత్రం రూ. 42 వేల కోట్లని చెప్పడం దారుణమన్నారు. ప్రజల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు నేరుగా జమ చేస్తుండడంతో తండ్రీ, కొడుకులకు ఏం చేయాలో అర్ధం కావట్లేదన్నారు. అంతేకాక, ‘టీడీపీ వాళ్లు ప్రతీ ఇంటికీ కొవ్వొత్తి, అగ్గిపెట్టె పంపిస్తారంట. దాంతో పాటు పచ్చ జెండాను కూడా పంపమనండి. అదే అగ్గిపెట్టెతో కాల్చి బూడిద చేస్తార’ని ఎద్దేవా చేశారు. ఇక, నాలుగు సార్లు కరెంటు ఛార్జీలు, మూడు సార్లు ఆర్టీసీ టిక్కెట్ల రేట్లు పెంచిన చంద్రబాబు.. నేడు మాట్లాడే నైతిక హక్కు కోల్పోయారని విమర్శించారు.