ఏపీలోని నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తాను మేకపాటి కొడుకును అంటూ శివ చరణ్ రెడ్డి అనే వ్యక్తి వెలుగులోకి వచ్చాడు. అయితే, తనకు కుమారుడు లేడని ఇటీవల తన తండ్రి చేసిన వ్యాఖ్యలతో మనస్తాపం చెంది బయటకు వచ్చానని శివచరణ్ రెడ్డి వెల్లడించారు. అయితే, శివచరణ్ రెడ్డి తన కుమారుడే కాదని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు.
మీడియాలో తనపై వచ్చిన కథనాలపై స్పందిస్తూ… తన మొదటి భార్య తులసమ్మకు పుట్టిన రచనారెడ్డి, రెండోభార్య శాంతమ్మకు పుట్టిన సాయి ప్రేమితారెడ్డి మాత్రమే తన వారసులని స్పష్టం చేశారు మేకపాటి. వీరు తప్ప తనకు కుమారులు ఎవరూ లేరని అన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న మహిళ భర్త పేరు వెంకటకొండారెడ్డి అని, కావాలంటే కంపసముద్రం వెళ్లి విచారించుకోవచ్చని అన్నారు. ఆమె భర్త ఎవరనేది ఆ గ్రామస్తులే చెబుతారని అన్నారు. తల్లీకొడుకులు ఇద్దరూ డబ్బుల కోసం తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని, ఇది సరికాదని అన్నారు. రాజకీయంగా నేరుగా ఎదుర్కోలేక, గాలి మనుషుల్ని తీసుకొచ్చి డొంకతిరుగుడు మాటలు మాట్లాడడం సరికాదని హితవు పలికారు. తన వ్యక్తిగత జీవితం మీద బురద జల్లాలని అనుకుంటే భగవంతుడు మిమ్మల్ని క్షమించడని అన్నారు. తాను శాంతమ్మ, పాపతోనే ఉంటున్నట్టు చెప్పారు.
మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఆరోపణలపై శివచరణ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తన తల్లికి చిన్నతనంలోనే మేనమామ కొండారెడ్డితో వివాహమైందని, విభేదాల వల్ల వారు విడిపోగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన తల్లితో సంబంధం పెట్టుకున్నారని తెలిపారు. ఐదేళ్ల తర్వాత తాను జన్మించానని శివ చరణ్ రెడ్డి చెప్పారు. డబ్బు కోసం అయితే తాను ఎప్పుడో అడిగేవాడినని.. తన సర్టిఫికెట్లలో కూడా తండ్రిగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేరే ఉందని స్పష్టం చేశారు. డీఎన్ఏ పరీక్షలకు తాను సిద్ధమని.. మేకపాటి కొడుకని నిరూపిస్తానని శివచరణ్ రెడ్డి పేర్కొన్నారు. తనకు రాజకీయ వారసత్వం లేదా ఆస్తి అక్కర్లేదని కేవలం గుర్తింపు మాత్రమే కోరుతున్నానని శివ చరణ్ రెడ్డి వెల్లడించారు.