ఏప్రిల్ 6న వైకాపా ఎంపీల రాజీనామా! - MicTv.in - Telugu News
mictv telugu

ఏప్రిల్ 6న వైకాపా ఎంపీల రాజీనామా!

February 13, 2018

ఏపీకి ప్రత్యేక హోదా సాధనపై రాజకీయ ఉద్యమం తీవ్రమవుతోంది. ఓ పక్క పవన్ కల్యాణ్ జేఏసీ ఏర్పాటు, మరోపక్క టీడీపీ ఎంపీల హెచ్చరిక నేపథ్యంలో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం ఏప్రిల్ 6వ తేదీలోగా కేంద్రం ప్రత్యేక హోదాపై ప్రకటన చేయకపోతే తమ ఎంపీలు ఆ రోజు రాజీనామా చేస్తారని ప్రకటించారు. ఆయన మంగళవారం నెల్లూరుజిల్లా కలిగిరిలో నిర్వహించిన  సభలో మాట్లాడారు.

‘ప్రత్యేక హోదాను చంద్రబాబు కేంద్ర ప్ర‌భుత్వానికి అమ్మేశాడు. ప్రత్యేక హోదా ఏపీకి సంజీవని అని ఎన్నిక‌ల ముందు చెప్పిన చంద్రబాబు తర్వాత మాట మార్చారు. ప్యాకేజీ కంటే ప్రత్యేక హోదా వల్ల జరిగే మేలేమిటి? అని అంటున్నాడు.  హోదాతో లాభం కంటే నష్టమే ఎక్కువని కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా చెప్పాడు.. వాళ్లది బూటకపు పోరాటం’ అని మండిపడ్డారు.

ఇదీ కార్యాచరణ..

‘మేం మార్చి 1న ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేస్తాం. నేను పాద‌యాత్ర చేస్తోన్న చోటుకి వ‌చ్చేనెల 3న మా పార్టీ  నేతలు వస్తారు. అక్కడే జెండా ఊపి ఉద్యమాన్ని ప్రారంభిస్తాను.. వచ్చేనెల 5న మ‌ళ్లీ పార్ల‌మెంటు సమావేశాలు ప్రారంభం అవుతాయి.  ఏప్రిల్ 6 వరకు ఉంటాయి. ఆ నెలపాటు మా ఎంపీలు ప్ర‌త్యేక హోదా కోసం పార్లమెంటులో పోరాడతారు. ఏప్రిల్ 6 చివ‌రి గ‌డువు. మా పోరాటంపై స్పందించ‌క‌పోతే అదే రోజు వైకాపా ఎంపీలు రాజీనామాలు చేస్తారు.. ’ అని జగన్ స్పష్టం చేస్తారు.