వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు షర్మిల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయబోతున్నారని ఆ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌బాబు, నియోజకవర్గ ఇన్చార్జి బీరవెల్లి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తున్నందున ఈనెల 19న నేలకొండపల్లిలో పాలేరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
పాలేరు నియోజకవర్గం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇక్కడ రెడ్డి సామాజికవర్గం నాయకులదే ఆధిపత్యం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కందాళ ఉపేందర్ రెడ్డి గెలుపొందారు. గిరిజన ఓటు బ్యాంకు అధికంగా ఉండడం.. ఆయా గ్రామ రాజకీయాలు రెడ్డి సామాజికవర్గం నేతల చేతిలో ఉండడం, రాంరెడ్డి వెంకటరెడ్డి మరణానంతరం కాంగ్రెస్‌కు బలమైన నాయకుడు లేకపోవడం లాంటి అంశాలు తమకు కలిసొస్తాయన్న ఉద్దేశంతో షర్మిల పాలేరు నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.