మహబూబాబాద్‌లో టెన్షన్ వాతావరణ నెలకొంది. బేతోలులోని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మీద షర్మిల చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. వైఎస్సార్‌టీపీ ఫ్లెక్సీలు, కటౌట్లను ధ్వంసం చేశారు. షర్మిల బస శిబిరం వద్ద ధర్నా చేపట్టారు. . దీంతో పోలీసులను భారీగా మోహరించారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అంతకుముందే వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతి రద్దు చేస్తున్నట్లు ఎస్పీ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఎలాగైనా పాద్రయాత్ర చేసేందుకు వెళ్లిన షర్మిలను అదుపులోకి తీసకున్నారు. పాదయాత్రను రద్దు చేసి..హైదరాబాద్ తరలిస్తున్నారు.
ఏం జరిగిందంటే?
తన పాదయాత్రలో భాగంగా శనివారం మహబూబాబాద్ జిల్లా నెళ్లికుదురు మండల కేంద్రంలో మాట్లాడిన షర్మిల.. ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
కనుసైగ చేస్తే చాలు తమ పార్టీ కార్యకర్తలు తరిమి కొడతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
” శంకర్ నాయక్ సైగ చెయ్యి.. ఎవడోస్తాడో చూస్తా. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు ఈ వైఎస్సార్ బిడ్డ. మీరు చేసిన మోసాలపై, అక్రమాలపై బరాబర్ ప్రశ్నిస్తాం. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తే, ఎమ్మెల్యే శంకర్ నాయక్ మమ్మల్ని కొజ్జాలని తిడతాడట. ఎవర్రా మీకు కొజ్జాలు? ఇచ్చిన వాగ్ధానాలు నిలబెట్టుకోవడం చేతకాని మీరు కొజ్జాలు. ప్రజల పక్షాన నిలబడి, కొట్లాడుతున్నందుకు భయపడాలా..?. మీరు చేసిన మోసాలు ఎత్తి చూపిస్తున్నందుకు భయపడాలా..?. మీ నోరు తెరిస్తే చాలు అన్ని అబద్ధాలు ఆడుతున్నారని, శంకర్ నాయక్ ఒక కబ్జా కోర్ అని, జనాల దగ్గర భూములు గుంజుకోడమే ఆయనకు తెలుసు.’ అంటూ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.