వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా చెన్నారావు పేట మండలం శంకరం తాండా వద్ద షర్మిలను అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డిపై షర్మిల చేసిన వ్యాఖ్యలను నిరసనగా గులాబీ శ్రేణులు ఆందోళణ నిర్వహించారు. వైఎస్సార్ టీపీ ప్లెక్సీలను చించేశారు. అంతేకాక, షర్మిల కాన్వాయ్ లోని ఓ వాహనాన్ని ధ్వంసం చేసి పెట్రోలో పోసి నిప్పంటించారు. దాంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో పాటు బాహాబాహీ జరిగింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో షర్మిల పాదయాత్ర కొనసాగించాలని భావించినా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. శాంతిభద్రతలకు విఘాతం వాటిల్లే అవకాశం ఉండడంతో నర్సంపేట పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి అక్కడ నుంచి తరలించారు. ఈ వ్యవహారంలో షర్మిల పోలసుల తీరును తీవ్రంగా తప్పుపట్టారు. బస్సుకు నిప్పు పెట్టిన వారిని వదిలేసి మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? అని మండిపడ్డారు. అన్ని అనుమతులు తీసుకొని పాదయాత్ర చేస్తున్నానని, దీన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను పనోళ్లలా వాడుకుంటున్నారని విమర్శించారు.