YSRTP Chief YS Sharmila Arrested by Delhi Police
mictv telugu

కాళేశ్వరం మా నాన్నదే.. ఢిల్లీలో షర్మిల రచ్చరచ్చ

March 14, 2023

 

YSRTP Chief YS Sharmila Arrested By Delhi Police

తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో అవినీతి జరిగిందని, దానిపై విచారణ చేపట్టాలని YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేశారు. సీఎం కేసీఆర్ హయాంలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఛలో పార్లమెంట్ కు పిలుపునిచ్చారు షర్మిల. ఈ క్రమంలో జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు ర్యాలీగా వెళుతుండగా మధ్యలోనే బారీకేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు పోలీసులు. పార్లమెంట్ సమావేశాల జరుగుతుండటంతో ఆందోళనలకు అనుమతి లేదని, ఆమెని అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు.

కాళేశ్వరం ఈ దేశంలోనే అతిపెద్ద స్కాం..

అంతకుముందు జంతర్ మంతర్ వద్ద మీడియాతో మాట్లాడిన షర్మిల.. కాళేశ్వరం దేశంలోనే అతిపెద్ద స్కాం అని.. 2జీ, కోల్ గేట్ స్కాంల కన్నా ఇదే పెద్దదన్నారు. “ రూ.1.20లక్షల కోట్ల ప్రజాధనం కాళేశ్వరంలో పోశారు. ఇందులో సీఎం కేసీఆర్ వేలాది కోట్లు దోచుకున్నారు. 18లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి, 1.5లక్షల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు. ఈ విషయాన్ని అసెంబ్లీలో బీఆర్ఎస్ మంత్రే ఒప్పుకున్నాడు. ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ.1.20లక్షల కోట్లలో దాదాపు రూ.లక్ష కోట్లు కేంద్ర సంస్థలే రుణాలు ఇచ్చాయి. పవర్ కార్పొరేషన్ రూ.38వేల కోట్లు, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ రూ.30వేల కోట్లు, పీఎన్ బీ రూ.11వేల కోట్లు, నాబార్డ్, ఇతర సంస్థలు కలిపి రూ.20వేల కోట్ల వరకు రుణాలు ఇచ్చాయి. ఈ సొమ్మంతా దేశ ప్రజలదే. అందుకే ఇది దేశంలోనే అతి పెద్ద స్కాం. రూ.1.20లక్షల కోట్లు ఖర్చు చేస్తే మూడేండ్లకే మునిగిపోయింది. దేశంలోని ప్రతి పౌరుడికి కాళేశ్వరం అవినీతిని తెలియజేయాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. కాళేశ్వరం ప్రాజెక్టులో నిబంధనలన్నీ గాలికి వదిలేశారు” అని ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ మా నాన్న ఆలోచన..

“కాళేశ్వరం ప్రాజెక్టుకు పురుడు పోసింది మహానేత వైఎస్సాఆర్. అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల పేరుతో ఈ ప్రాజెక్టుకు గతంలోనే శ్రీకారం చుట్టారు. రూ.38వేల కోట్లతోనే 16లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలని వైఎస్సాఆర్ భావించారు. కేవలం గ్రావిటీ ద్వారానే ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని భావించారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఈ ప్రాజెక్టును రీడిజైనింగ్ చేశారు. ప్రాజెక్టు వ్యయాన్ని మూడు రెట్లు పెంచి అవినీతికి పాల్పడ్డారు. ఎత్తిపోతల అవసరం లేకున్నా పెద్ద పెద్ద మోటార్లతో నీళ్లు తోడారు. రూ.1600 కోట్లతో కొనుగోలు చేసిన మోటార్లకు రూ.7వేల కోట్ల లెక్కచూపారు. రూ.38వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు రూ.1.20లక్షల కోట్లు ఖర్చు చేశారు. ప్రతి ప్యాకేజీలో అవినీతి జరిగింది” అని అన్నారు షర్మిల.

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కేసీఆర్ కు, మెగాకు అమ్ముడుపోయాయని షర్మిల ఆరోపించారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మెగాకు అమ్ముడుపోయారు. అందుకే ఆ పార్టీలు కాళేశ్వరం అవినీతిపై ప్రశ్నించడం లేదన్నారు. రాష్ట్రంలో కాదు.. దేశంలోనే కేసీఆర్ అవినీతిపై పోరాడుతున్న ఏకైక పార్టీ YSR తెలంగాణ పార్టీ అని అన్నారు.