YSRTP chief YS Sharmila made strong comments on the previous by-elections on Thursday
mictv telugu

అక్కడ నల్లా తిప్పితే నీళ్లకు బదులు లిక్కర్ వస్తోంది

October 28, 2022

రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగిన యత్నం, మునుగోడు ఉప ఎన్నికలపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల గురువారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాదయాత్రలో భాగంగా నిర్మల్‌ జిల్లా ఖానా పూర్‌లో గురువారం మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికను డబ్బుతో గెలవాలనుకుంటున్న ప్రధాన పార్టీలు…ఓటర్లను భారీ ఎత్తున ప్రలోభాలకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. ఈ క్రమంలోనే మునుగోడులో నల్లా తిప్పితే నీళ్లకు బదులుగా లిక్కర్ వస్తోందని ఆమె ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేయకుండా బహిష్కరించాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ తాలిబన్ల, గూండాల రాజ్యంగా మారిందని షర్మిల దుయ్యబట్టారు.

ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగిన యత్నంపై కూడా షర్మిల స్పందించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అసలు అమ్మాలనుకున్నదెవరో, కొనాలనుకున్నదెవరో రాష్ట్ర ప్రజలకు తెలియాలన్నారు. ఈ మేరకు మొయినాబాద్‌ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. కేవలం డబ్బులు దొరికాయంటూ కొందరిని అరెస్ట్ చేసిన పోలీసులు… అక్కడే ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాత్రం ప్రగతి భవన్ కు ఎందుకు తరలించారని ప్రశ్నించారు. ఘటనా స్థలంలోనే ఉన్న ఎమ్మెల్యేలను కూడా విచారించాలి కదా అని ఆమె అన్నారు. నలుగురు ఎమ్మెల్యేలు అమాయకులే అయితే… వారిని ప్రగతి భవన్ లో ఎందుకు దాచారని కూడా షర్మిల ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉందని స్పష్టం చేశారు. ఇక ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం నాటికి 2800 కిలోమీటర్లు దాటింది.