వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు ప్రారంభం - MicTv.in - Telugu News
mictv telugu

వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు ప్రారంభం

April 1, 2022

03

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం శుక్రవారం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గర్భిణీ మహిళలు ప్రభుత్వాస్పత్రిలో ప్రసవానంతరం తల్లీబిడ్డను సురక్షితంగా, సౌకర్యవంతంగా వారి ఇంటికి చేర్చే 500 ‘డాక్టర్‌ వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వాహనాలను ప్రారంభించింది. విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌ వేదికగా జగన్‌ మోహన్‌ రెడ్డి జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో కూనారిల్లిన 108,104 సేవలకు ఊపిరిలూదినట్టుగానే, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలనూ ప్రభుత్వం విస్తరించింది. అరకొరగా ఉన్న పాత వాహనాల స్థానంలో 500 కొత్త వాహనాలను ప్రవేశపెట్టింది.

జగన్‌ మాట్లాడుతూ.. ”ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అక్కచెల్లెమ్మల కోసం అత్యాధునిక వాహనాలను అందుబాటులోకి తెచ్చాం. ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నాం. అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకే ఈ వాహనాలను ప్రారంభిస్తున్నాం. గతంలో వాహనాలు అరకొరగా ఉండేవి, వసతులు కూడా సరిగా ఉండేవి కావు. నాడు-నేడుతో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుతున్నాయి” అని జగన్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆళ్ల నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, శంకర నారాయణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.