‘యుద్ధం శరణం’ అన్న ప్రేక్షకుడు! - MicTv.in - Telugu News
mictv telugu

‘యుద్ధం శరణం’ అన్న ప్రేక్షకుడు!

September 8, 2017

చిత్రం :  యుద్ధం శరణం ,నిడివి : 140 నిముషాల 50 సెకన్లు,సమర్పణ : సాయి శివాని, బేనర్ : వారాహి చలన చిత్రం కథ : డేవిడ్ ఆర్ నాథన్ ,మాటలు : అబ్బూరి రవి, స్క్రీన్ ప్లే : డేవిడ్ ఆర్ నాథన్, అబ్బూరి రవి, పాటలు : శ్రేష్ఠ, కిట్టు విస్సాప్రగడ, ప్రణయ్ చాగంటి, సంగీతం : వివేక్ సాగర్ ,సినిమాటోగ్రఫి : నికేత్ బొమ్మిరెడ్డి ,ఎడిటింగ్ : క్రిపాకరన్ ,నిర్మాత : రజని కొర్రపాటి  ,దర్శకత్వం : కృష్ణ ఆర్.వి. మారిముత్తు

నటులు : అక్కినేని నాగచైతన్య, లావణ్య త్రిపాఠి, శ్రీకాంత్, రేవతి, రావు రమేష్, మురళీశర్మ, రవివర్మ, ప్రియదర్శి తదితరులు

అంతో యింతో మంచి చిత్రాలను తీసి తనదైన గుర్తింపును తెచ్చుకున్న వారాహి చలన చిత్ర సంస్థ యిటీవల వరుసగా విజయాలకు దూరమవుతూ వస్తోంది. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాతో కాస్తంత విజయానికి చేరువ కాగలిగిన నాగ చైతన్యకు సరైన విజయం లేదు. అందుకే ‘యుద్ధం శరణం’ అని అనుకొని మనముందుకు రాక తప్పలేదు! అయినా సరే ‘యుద్ధం’లో వోటమి తప్పలేదు!

సామాన్యుడి సాహసం గురించి గతంలోనూ చాలా సినిమాలు వచ్చాయి. సామాన్యుడి తిరుగుబాటు.. తిరుబాటు చెయ్యలేని ప్రేక్షకుణ్ణి సంతృప్తి పరుస్తుంది. చెప్పాలంటే  ప్రధాన పాత్రల జీవితానికి మనజీవితానికి కాస్తంత దగ్గర సంబంధం వుండాలి. అయితే పూర్తి సహజంగానైనా వుండాలి. లేదంటే పూర్తి సినిమా టిక్ గానైనా వుండాలి. ఎమోషనల్ గా యేదోలా హుక్ చెయ్యాలి. అప్పుడే సినిమా మనల్ని కట్టిపడేస్తుంది. అటూ యిటూ కాకుండా చేస్తే- సినిమా కోసం సినిమాగా చేస్తే- చూసే రోజులకు కాలం చెల్లింది.

ఎప్పటిలాగే ఎక్కడికక్కడ నగరమంతా బాంబులు బ్లాస్ట్ చెయ్యడానికి పథకం వేస్తూ – బ్లాస్ట్ అవుతూ కథ మొదలవుతుంది! స్కామ్ చేసిన మంత్రులు ప్రజల దృష్టిని మరల్చడానికి బాంబులు పేలుస్తారు. విధ్వంసం జరిగిన తరువాత అర్జున్ (నాగచైతన్య) తలిదండ్రుల్ని వెతుకుతూ బయల్దేరుతాడు. ఆచూకీ తెలీదు. గతం కళ్ళముందు కదులుతూ వుంటుంది. ‘సింపుల్ అండ్ బ్యూటీఫుల్ ఫామిలీ’. తండ్రి(రావు రమేష్), తల్లి(రేవతి) యిద్దరూ పల్లెల్లో వైద్యమూ మిగతా అవసరాలు తీరుస్తూ వుంటారు. ఇంతలో అక్కడికో అమ్మాయి, అంజలి(లావణ్య త్రిపాఠి) వస్తుంది. తొలిచూపుల్లోనే వొకరిని వొకరు యిష్టపడతారు. అర్జున్ డ్రోన్ తయారు చేస్తూ తనపరిశోధనల్లో తాను వుంటాడు. పేరెంట్స్ థర్టీయత్ యానివర్సరీ సందర్భంగా సినిమాకు పంపిన అర్జున్ అమ్మానాన్న యేమయ్యారో తెలీక వెదుకులాడుతూ వుంటాడు. కారణం తెలుసుకొనే ప్రయత్నంలో వుండగా కుటుంబాన్ని యెవరో మట్టుపెట్టాలని చేసిన ప్రయత్నం నుండి కాపాడుకుంటాడు. తలిదండ్రుల మృతికి కారణం యేమిటి? బం బ్లాస్ట్స్ కారణమా? కాదా? కారణాలను యెలా తెలుసుకున్నాడు? తెలుసుకొని యుద్ధానికి యెలా తలపడ్డాడనేది మిగతా చూడవలసిన కథ!

హ్యాపీ ఫేమిలీ బ్యాక్ డ్రాప్ లో చూపిస్తూ థ్రిల్లర్ గా కథను నడపాలని దర్శకుడు చేసిన ప్రయత్నం సక్సెస్ కాలేదు. బిగువుగా వుండాల్సిన కథనం సడలిపోయింది. అందుకు స్క్రీన్ ప్లే సహాయం చేసింది. వెరసి కథనం ఉత్కంటను కోల్పోయి నెమ్మదించి ప్రేక్షకుడు బోరు ఫీలయ్యేలా చేసింది. ఫ్యామిలీ ఎమోషన్స్ క్యారీ కాకముందే నేరేటీవ్ స్టైల్ కథని బ్రేక్ చేసింది. థ్రిల్లరుగా వుండాల్సిన కథానానికి ఫ్యామిలీ బ్రేక్ వేసింది. అలా అటు ఫ్యామిలీ.. యిటు క్రైమ్.. యీ రెండు జమిలీగా నడపడంలో విఫలమై సినిమా గ్రాఫ్ పడిపోయింది! అలాగే సినిమాలో అవసరం లేని విషయాలు.. మంచిపనులకు అడ్డుపడ్డ నాయకుడు.. అతని కూతురు ప్రసవపు ప్రమాద ప్రహసనం.. అందుకు హీరో తను చేసిన ప్రయత్నం ఎస్టాబ్లిస్మెంటుకు ఉపయోగపడిందే తప్ప సినిమాకు ఉపయోగపడలేదు! లోపాలను పక్కనపెడితే కథలో లీనం చేసే హుక్ పడకపోవడంతో సినిమా చూస్తూ ప్రేక్షకుడు ‘యుద్ధం శరణం’ అని అనుకోవాల్సి వస్తుంది!

నాగచైతన్య తన ప్రయత్నం తాను చేశాడు. లావణ్య త్రిపాఠి కథనం పరంగా సెకండాఫ్ లో తెరమరుగయ్యింది. రావు  రమేష్, రేవతి పాత్రలమేరకి నటించారు. శ్రీకాంత్ విలన్ గా ఫరావాలేదనుకున్నా- ముగింపుకు వచ్చేసరికి యెలా చంపాడో అలానే చంపడం.. పాత్ర పరిధి పెరగకుండా చేసింది. ప్రియదర్శిని వుపయోగించుకోలేదు. పాటలు కొత్త ప్రయత్నంగా అనిపించినా వెంటనే మర్చిపోతాం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. మాటలు బాగా రాసే అబ్బూరి రవి ఇందులో పండించలేకపోయారు.

ఓపికగా ‘యుద్ధం శరణం’ చూసిన ప్రేక్షకుడు విసుగు గాయాలతో బయటికొస్తాడు!

రేటింగ్: 2.25/5