ఇంటిని హోటల్‌గా మార్చిన యువరాజ్ సింగ్.. ఒక్క రాత్రికి ఎంతంటే - Telugu News - Mic tv
mictv telugu

ఇంటిని హోటల్‌గా మార్చిన యువరాజ్ సింగ్.. ఒక్క రాత్రికి ఎంతంటే

September 28, 2022

టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఏకంగా తన ఇంటిలోనే బస ఏర్పాటు చేసి తనతో మాట్లాడే అవకాశం కల్పించాడు. గోవాలో ఎంతో ఇష్టంగా కట్టుకున్న కాసా సింగ్ అనే ఇంట్లో ఆరుగురు అభిమానులకు ఈ సౌకర్యం కల్పిస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇందుకోసం వెకేషన్ రెంటల్ కంపెనీ అయిన ఎయిర్ బీఎన్‌బీ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని సూచించాడు. అక్టోబర్ 14 నుంచి 16 వరకు రెండు రాత్రులు అందులో బస చేయవచ్చు.

సెప్టెంబర్ 28న బుకింగ్స్ ప్రారంభం అవగా, భారతీయులతో పాటు విదేశీయులు కూడా బుక్ చేసుకోవచ్చని తెలిపాడు. ఇంట్లో బసచేసే వ్యక్తులతో వర్చువల్‌గా మాట్లాడతానని కూడా ప్రకటించాడు. ఒక్కో రాత్రికి రూ. 1200 వసూలు చేస్తున్నానని, దీవార్ ద్వీపం అందాలు, ఈ బైక్ టూర్, ఆహార పదార్ధాలు, సముద్ర అందాలు వీక్షించవచ్చని పేర్కొన్నాడు. అంతేకాక, ఇంట్లో తన కెరీర్లో మైలురాళ్లకు సంబంధించిన ఫోటోలు ఉంటాయని, వాటితో సెల్ఫీలు దిగవచ్చని వివరించాడు. కాగా, బుధవారం బుకింగ్స్ ప్రారంభమవడంతో ఆ ఆరుగురు వ్యక్తులు ఎవరో ఈ పాటికి తేలిపోయి ఉంటుంది.