విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తున్నాం..త్వరలోనే నేను కూడా షిఫ్ట్ అవుతున్నా..మీరు కూడా రండి అంటూ ఢిల్లీలోని గ్లోబల్ ఇన్వెష్టర్స్ సమావేశంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. రాజధాని వ్యవహారం సుప్రీం కోర్టులో ఉండగా ఎలా ప్రకటన చేస్తారంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. వివేక హత్యపై సీబీఐ దూకుడు పెంచడంతో.. ప్రజల దృష్టి అటు మళ్లకుండా రాజధానిపై ప్రకటన చేశారని ఆరోపణలు సైతం వస్తున్నాయి. అయితే వైసీపీ నాయకులు మాత్రం విశాఖలో రాజధాని ఏర్పాటు చేసి తీరుతామని బల్లగుద్ది చెప్తున్నారు. తాజాగా సీఎం వ్యాఖ్యలపై చర్చ జరుగుతున్నసమయంలోనే టీడీపీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రాజధానిపై మరో ప్రకటన చేశారు.
ఏప్రిల్‌లోనే విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. సీఎం చెప్పిన మాట ప్రకారం అధికారం యంత్రాంగం మొత్తం విశాఖకు తరలివెళ్తుందని చెప్పారు. ప్రభుత్వభవనాలను కార్యాలయాలుగా వినియోగించుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఐటీ కంపెనీలు తక్కువగా ఉండడంతో భీమిలి ప్రాంతంలోని ఆ భవనాలు, వీఎంఆర్డీఏకు చెందిన భవనాలను ఉపయోగించుకుంటామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. సింహాచలం దేవస్థానానికి వచ్చిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలను చేశారు.