కేంద్ర బడ్జెట్ 2023లో తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. బడ్జెట్ బావుందని ఏపీ ప్రభుత్వంలోని పెద్దలు చెబుతుంటే తెలంగాణ సర్కారు పెద్దలు మాత్రం దుమ్మెత్తి పోస్తున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకకు ప్యాకేజీలు ప్రకటించి తమకు మొండిచేయి చూపారని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదారాబాద్ నగరంలో రాత్రికి రాత్రి సటైరికల్ ఫ్లెక్సీలు ప్రత్యక్షమై కలకలం రేపుతున్నాయి. కేంద్ర బడ్జెట్‌లో మోదీ తెలంగాణకు ఇచ్చింది జీరో అని ఎండగడుతూ ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ZEROను ఎర్రటి ఎరుపులో అచ్చేసి, O అక్షరం లోపల ప్రధాని మోదీ తలదించుకున్నట్లు ఫోటోను జత చేశారు.
Ruling #BRS Put posters expressing disappointment over the General Budget and non-allocation of funds to #Telangana. #Budget2023 pic.twitter.com/um0Os7hB1D
— Ashish (@KP_Aashish) February 2, 2023
బీఆర్ఎస్ శ్రేణులే వీటిని ఏర్పాటు చేసి ఉంటాయని భావిస్తున్నారు. వీటిపై సోషల్ మీడియాలో గులాబీ శ్రేణులకు, కాషాయ శ్రేణులకు యుద్ధం జరుగుతోంది. సింగరేణి, ఎయిమ్స్ వంటివాటికి కేంద్ర బడ్జెట్ లో నిధులు ఇచ్చామని బీజేపీ నెటిజన్లు చెబుతుంటే బయ్యారం ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీ, విభజన హామీల మాటేమిటని బీఆర్ఎస్ నెజిజనం అడుగుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తాము ఫ్లెక్సీలు పెడితే అడ్డుచెప్పిన జీహెచ్ఎంసీ ఈ జీరో ఫ్లెక్సీలకు ఎలా అనుమిచ్చిందని బీజేపీ జనం అక్కసు వెళ్లగక్కుతున్నారు.