Zimbabwe won the third ODI against Australia
mictv telugu

పసికూన జింబాబ్వే సంచలనం.. ఆస్ట్రేలియాపై సూపర్ విక్టరీ

September 3, 2022

క్రికెట్‌లో సంచలనం నమోదైంది. పసికూన వంటి జింబాబ్వే జట్టు పటిష్టమైన ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. దీంతో 18 ఏళ్లుగా ఉన్న కసిని తీర్చుకున్నట్టయింది. మ్యాచ్ వివరాల్లోకెళితే.. జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియాలో మూడు వన్డేల నిమిత్తం పర్యటిస్తోంది. ఇప్పటికే రెండు మ్యాచులలో ఓడిపోయిన జింబాబ్వే మూడో వన్డేలో గెలిచి క్లీన్ స్వీప్ నుంచి తప్పించుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కంగారూ జట్టు 31 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటయింది. డేవిడ్ వార్నర్ ఒక్కడే 94 పరుగులు చేయగా, మిగతా వారు కలిసి కేవలం 47 పరుగులు మాత్రమే చేయగలిగారు. జింబాబ్వే బౌలర్ ర్యాన్ బర్ల్ ఐదు వికెట్టు తీసి ఆసీస్‌ను కుప్పకూల్చగా, ఎవాన్స్ రెండు, విలియమ్స్, న్యాచీ, నగర్వా తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే జట్టు 39 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తడివానాశే మారుమని 35, చకబ్వా 37 పరుగులు చేసి రాణించడంతో ఆ జట్టు విజయం సాధించింది. కాగా, ఓవరాల్‌గా జింబాబ్వేకి ఆసీస్‌పై ఇది మూడో విజయం కాగా, ఆసీస్ గడ్డపై ఇదే తొలివిజయం కావడం గమనార్హం. ఇదొక రికార్డు అయితే ఇదే మ్యాచులో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ అరుదైన రికార్డు సాధించాడు. వన్డే క్రికెట్‌లో తక్కువ మ్యాచులు (102) ఆడి 200 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. తర్వాత పాక్ మాజీ బౌలర్ సక్లయిన ముస్తాక్ (104) మ్యాచులతో రెండో స్థానంలో ఉన్నాడు. అటు వన్డేల్లో అత్యంత వేగంగా వంద వికెట్లు తీసిన పేసర్‌గా స్టార్క్ ఇప్పటికే రికార్డు సృష్టించాడు.