జింబాబ్వే దేశ ప్రజలు తీసుకుంటున్న రుణాలు ఆ దేశ కరెన్సీ విలువ పతనానికి కారణమవుతున్నాయి. దీంతో వాటిని నియంత్రించేందుకు వడ్డీ రేట్లను పెంచాలని అనుకుంటున్నట్టు అక్కడి సెంట్రల్ బ్యాంకు మానిటరీ పాలసీ కమిటీ సభ్యుడైన గ్వన్యాన్య తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక వడ్డీ రేట్లు ఉన్న జింబాబ్వేలో ద్రవ్యోల్బణం జూన్ నెలకు 191.6 శాతానికి చేరింది. ఈ నేపథ్యంలో గ్వన్యాన్య మీడియాతో మాట్లాడారు. ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోవడంతో దీనికి సమాన స్థాయిలో వడ్డీ రేట్లను తీసుకెళ్లడంపై జింబాబ్వే సెంట్రల్ బ్యాంకు ఎంపీసీ ఈ వారం చివర్లో నిర్ణయం ప్రకటించనుంది.
ప్రస్తుతం జింబాబ్వేలో కీలక రేటు 80 శాతంగా ఉంది. దీనికంటే తక్కువ రేటుకు రుణాలు ఇవ్వరాదంటూ జూన్ 17న తాము బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశామని గ్వన్యాన్య తెలిపారు. బుల్లెట్ ను విడిచి పెట్టాలని నిర్ణయించామని, దూకుడుగా వడ్డీ రేట్లను పెంచడం ద్వారా స్థిరత్వాన్ని సాధిస్తామని ప్రకటించారు. 190 శాతం వడ్డీ రేటు ప్రకారం రూ.10,000 డిపాజిట్ మొత్తం ఏడాది తర్వాత సుమారు రూ.29,000 అవుతుంది.