ఫేస్ బుక్ జిందగీ జిందాబాద్ ! - MicTv.in - Telugu News
mictv telugu

ఫేస్ బుక్ జిందగీ జిందాబాద్ !

July 6, 2017

లైఫ్, జీవితం, బతుకు, జిందగీ.., ఇలా ఎలా నిర్వచించుకున్నా ఒడవని కమ్మని కావ్యం మన జిందగీ. మనం శ్వాస తీస్కొని ఈ పుడమి మీద చేసే సంతకం జిందగీ… కాల గమనంలో ఎన్నో జిందగీలు విశ్వ రేఖపై చెరగని ఆటోగ్రాఫ్ లు చేసుంటాయి.. అలాంటి మనం జీవించే క్షణాన్నికెమెరాతో క్లిక్ మన్పించి ఒక ఛాయాచిత్రంగా తీసుకొని దాన్ని పదే పదే చూస్కుంటే ఎలా వుంటుంది ? ఫీల్ బెటర్ కదా.. లైఫ్ ఇంకాస్త రసరంజకంగా సాగుతుందన్నట్టే అనిపిస్తుంది కదూ.. అలాగే మన లైఫ్ తో పాటు ఇంకొకరి లైఫ్ స్టైల్ ను ఫోటోలో చూస్తే ఇంకెలా వుంటుంది ? వాళ్ళ లైఫ్ కు ఎదుటివారి లైఫుకున్న వ్యత్యాసం తెలుస్తుంది. వివిధ, విభిన్న రకాల జీవన శైలి మన మస్తిష్కం మీద పచ్చబొట్టై వుండిపోతుంది కదూ..

జిందగీని ఎన్నో రుచుల సంగమంగా ఆస్వాదించుకున్నట్టు, ఆరగించినట్టు అనిపిస్తుంది కదూ.. రుచులు ఆరే కానీ లైఫులో ముడిపడివున్న జిందగీ తరీకలు భిన్నం. అలాంటి భిన్నత్వాన్ని ఏకత్వంగా నిర్వచించే ఆన్ లైన్ ఫేస్ బుక్ వేదిక ‘ జిందగీ ఇమేజెస్ ’ నాలెడ్జ్ బోధించే పుస్తకాలు, తత్వం రంగరించే గ్రంథాలు, కదిలే బొమ్మల కదంబమైన సినిమా.., ఇలా ఏ మాధ్యమమూ కూడా చూపని గొప్ప ప్రభావాన్ని ఒక ఛాయా చిత్రమే చూపగలుగుతుంది. జిందగీలో మిళితమై అమీర్, గరీబ్, చదువుకున్నవాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, పిల్లలు, పెద్దలు, పశువులు, పక్షులు.., ఇలా చాలా వున్నాయి. ఈ భూమ్మీద జీవిస్తున్న జిందగీ రూపురేఖలు ఖూబ్ సూరత్ రంగ్ బిరంగే హై.

‘‘ జిందగీ నా మిలేగి దుబారా.. తో ఖిడ్ కీ ఖోలో జిందగీ ఇమేజెస్ కా.. రంగీన్ ఖ్వాబోంకే తోఫా లే చలో అప్నే సునెహరీ సాంసోంమే.. జీనేకా మఖ్సత్, జీనేమే మిఠాస్ సిర్ఫ్ మిలేగా ఆప్ దిల్ ఖుషీసే జీనేసె.. తో ఆవో జిందగీకే బాగ్ మే రంగీన్ ఫూలోం కే బీచ్ ఘుమే… ’’

ఫేస్ బుక్

 

ఫేస్ బుక్ వేదికగా సాగుతున్న ఆన్ లైన్ వేదిక జిందగీ ఇమేజెస్ గ్రూప్. ఫేస్ బుక్కంటే ఫోటోలు, రాతలుంటాయి. వాటికి లైకులు, కామెంట్లు, షేర్లు వుంటాయి..కానీ ఇలా ఫోటోలతోనే జిందగీని నిర్వచించడం అనేది చాలా భిన్నమైన ఆలోచన. అదీ ఎఫ్ బీ వేదికగా. ఫేస్ బుక్ లో ఇంత మంచి గ్రూప్ వుందా అంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే.

జిందగీ పుట్టుక :

ఈ బృహత్తర ఆలోచనకు ఊపిరి పోసింది చేగొండి చంద్ర శేఖర్. తను తెలంగాణ ఉద్యమ మూమెంట్లో చాలా అగ్రెసివ్ గా పాల్గొని అదే స్పిరిట్ తో కామన్ మేన్ వేదికను ఒకదాన్ని రూపొందించాలనే తలంపులోంచి వచ్చిందే జిందగీ ఇమేజెస్ గ్రూప్. 2006 లో వచ్చిన ఈ ఐడియాను ఎలాగైనా ఒక బృహత్తర వేదికలా తయారు చెయ్యాలనుకున్నాడు. తన మైండులో తొలుత క్లిక్ అయిన ఇమేజ్ ని ఆన్ లైన్ వేదికగా డిజైన్ చేశాడు. అలా సెప్టెంబర్ 17, 2010 లో రిజిస్టర్ చేసాడు. ఆగస్టు 17, 2014 నుండి తన జర్నీ కంటిన్యూ చేసింది జిందగీ ఇమేజెస్ గ్రూప్. అప్పటినుండి ఇప్పటి వరకు ఎంతో జనరంజకంగా సాగిపోతున్నది. ఎన్నో మైమరిపించే మైలురాళ్ళను దాటుకుంటూ ఛాయాచిత్రాల కదంబంలా మునుముందుకు సాగిపోతోంది జిందగీ. ఇప్పటివరకు 58 వేల మంది సభ్యలున్నారు ఈ గ్రూప్ లో. ఎవ్రీ మంత్ 1000 మంది కొత్త సభ్యులు యాడ్ అవుతున్నారంటే చూడండి జిందగీ కిత్నే లోగోంకే దిలోంకో ఛాగయీ.. ఒక సెక్షన్ లేకుండా యూనివర్సల్ ఐడియాలజీతో, పాజిటివ్ వేలో ముందుకు పోతున్నది ఈ గ్రూప్.

జిందగీ ముఖ్యోద్దేశం

మన లైఫ్ ను మన పాయింటాఫ్ వ్యూలో, మన పర్ ఫెక్షన్ లో గాకుండా ఇతరుల పాయింటాఫ్ వ్యూలోంచి చూస్తే తెలుస్తుంది జిందగీ యొక్క సింగిడి రంగుల మతలబు. మనం సమాజంలో వుంటూ ఏమైనా చెయ్యగలుగుతాము. ఆ చేసిన పనులను కెమెరాతో క్లిక్కుమనిపించుకొని చూస్కున్నప్పుడల్లా ఆ ఆనందం ఎంత అందంగా వుంటుంది. గతిస్తున్న జ్ఞాపకాలను ఖాయం చేసి భద్ర పరిచే ఏకైక వారధి ఫోటో. అలాంటి ఫోటోలకు వేదికే జిందగీ. మనం రాయలేని, చదవలేని లైఫులు చాలా వుంటాయ్. అలాంటివాటిని ఫోటోగా చూస్కుంటే ఎలా వుంటుంది ? అద్భుతంగా వుంటుంది.. అలాంటి అద్భుతాలకు వేదిక జిందగీ గ్రూపు.
ఇందులో చాలా రకాల మనుషులున్నారు. వారు వారు తమ తమ లైఫును ప్రెజెంట్ చేసే తీరులో జిందగీ సౌందర్యం కళ్ళకు కడుతుంది. ఎన్నో కొత్త కొత్త జీవితాలు ప్రతిరోజూ పరిచయమౌతుంటాయి ఈ గ్రూపులో. ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ ను చూస్తుంటే చాలా బాధగానూ, కొందరి లైఫును చూస్తుంటే ఆనందంగానూ వుంటుంది. రంగురంగుల పూలవనంలో విహరించినట్టు వుంటుంది. సమస్య దెగ్గరికి వాళ్ళే వెళ్ళటం, దాన్ని క్లిక్ చేసి ఛాయాచిత్రంగా ప్రెజెంట్ చెయ్యటం అనేది ఒక సెన్సిటివ్ ప్రాసెస్. లైఫ్ మీద మమకారాన్ని పెంచే యాక్షన్ ఇది. రియల్ లైఫ్ లో జరిగిందే చెప్పాలి. ప్రాబ్లెమ్స్ వున్నాయని కరెక్టుగా చెప్పగలగాలి. నో ఒపీనియన్స్.. ఎలాంటి నెగెటివ్ కామెంట్లు లేకుండా చాలా ప్యూర్ గా, మంచి ఉద్దేశంతో ముందుకు పోతోంది జిందగీ.

బడా బలగం జిందగీ

వ్యక్తికి శక్తి కుటుంబమే. జిందగీ ఇమేజెస్ గ్రూప్ 58,000 మంది బలగంగా ఏర్పడి ఒక సామాజిక సంస్థలా ముందుకు పోతున్నది. ఆన్ లైన్ వేదికగా ఇంత పెద్ద సక్సెస్ ను చవిచూసింది జిందగీ ఇమెజెస్ గ్రూప్ ఒక్కటే. అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, వదినలు, పిల్లలు, పెద్దమ్మలు, చిన్నమ్మలే కాదు రైటర్లు, డైరెక్టర్లు, రైతులు, బిజినెస్ మెన్లు, సామాజిక కార్యకర్తలు.., ఇలా ఎంతో మంది ఏ వ్యక్తిగత ఛాందసంతో ఆస్కారం లేకుండా చక్కగా వరుసలతో కలిసిపోయి ఒక బిగ్ ఫ్యామిలీగా ఏర్పడ్డారు ఈ గ్రూపులో. ‘ రేపు నాకేమైనా అయితే నా తరుపున వాదించడానికి, ఆదెరువుగా నిలబడటానికి నాకు నా జిందగీ కుటుంబం వుంది ’ అనుకునేంత భరోసా నింపింది గ్రూపు సభ్యుల్లో. ఇందులో రెగ్యలర్ గా ఎన్నో ఫోటోలు అప్ లోడ్ అవుతుంటాయి. ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క కథ చెబతుంది. గ్రామీణం, నగరం, ప్రకృతి, మానవ సంబంధాలు.., ఇలా ఎన్నో ఛాయాచిత్ర కథనాలు జిందగీలో కనిపిస్తాయి. ఏ ఒక్క చిత్రమూ ఫుజూల్ అని తీసి పారెయ్యటానికి వీల్లేదు. ప్రతీ ఫోటో ఫ్రేమ్ కట్టి చూస్కునేటంత గొప్పగా వుంటుంది. ఆ ఫోటోల్లో వుండే రానెస్ సహజ జిందగీని అవిష్కరిస్తుంది. ఎన్నో మనకు పరిచయం లేని జీవితాలు ఫోటోల్లో మాట్లాడుతుంటాయి. గల్ఫ్ లో వున్నవాళ్ళు కూడా చాలా మంది జిందగీలో సభ్యులుగా వున్నారు. వాళ్ళంతా మా జిందగీ, ఇది మా ఉమ్మడి కుటుంబం అంటున్నారు.
కాల క్రమంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమై మళ్ళీ ఇలా జిందగీ ఇమేజెస్ గ్రూప్ ద్వారా పునరాగమనం చెందుతుందా అన్నంత ధీమాను కల్పిస్తోంది. ఈ ఉమ్మడి కుటుంబ సభ్యలందరూ ఆన్ లైన్ లోనే కాదు లైవ్ లో కూడా తొలుత రెండు నెలలకొకసారి మీట్ అయ్యేవారు. ఇప్పుడు నెలన్నరకొకసారి మీట్ అవ్వాలనుకుంటున్నారు. ఆ మీటింగులో అందరూ కలిసిపోయి చక్కని అనుబంధపు వేడుక చేస్కుంటారు. అన్నా, అక్కా, తమ్ముడూ.., అంటూ ఆప్యాయతలను పంచుకుంటారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడమే కాదు ఒక సామాజిక సమస్య గురించి చర్చ పెట్టుకుంటారు. దానికి మన కుటుంబం నుండి ఎలాంటి సహాయం చేయగలం, ఏం చెయ్యగలం అని మాట్లాడుకొనే గొప్ప సామాజిక స్పృహ గల వేదిక జిందగీ ఇమేజెస్ గ్రూపు.

సోషల్ గ్రూప్

ఈ గ్రూప్ ను సోషల్ గ్రూప్ అని కూడా అనవచ్చు. ఏదో ఒక సమస్య మీద నిత్యం ఈ గ్రూపు తమ వాయిస్ విన్పిస్తూ ఎంతో మందిలో ఆలోచనలను, మార్పును రేకెత్తిస్తున్నది. సమాజం గురించి తమ కర్తవ్యాన్ని గుర్తెరిగవాళ్ళు జిందగీ కుటుంబ సభ్యులు. ఈ విశాల సమాజమే వారి కుటుంబం. ఈ సమాజంలోని ప్రతీ సమస్య తమ కుటుంబానిదే. కామన్ మెన్ గా లైఫ్ ని ఇండిపెండెంటుగా చూడటం నిజంగా జిందగీ కుటుంబ సభ్యలకే చెల్లింది. అందరూ ఎప్పుడు కలిసినా చేనేత వస్త్రాలే తప్పనిసరిగా ధరిస్తారు. అప్పుడు చాలా ఆఫీసులల్లో, యూనియన్ లల్లో చలనం వచ్చి చేనేత మీద మమకారం పెరిగింది. ఆడవాళ్ళు మాత్రమే కాదు మగవాళ్ళు కూడా జిందగీ కోసం వంటలు చేసి ఫోటోలు అప్ లోడ్ చేయటం అనేది ఒక సామాజిక విప్లవం కాకపోతే ఏమిటి ? గల్ఫ్ జిందగీ అని, వీవర్ జిందగీ, బ్లైండ్ జిందగీ, బెగ్గర్ జిందగీ, ఫోక్ జిందగీ, అమీర్ జిందగీ, గరీబ్ జిందగీ.., ఇలా ఎన్నో జిందగీల ప్రస్తావనలతో సోషల్ సర్వీస్ కు వెన్నుదన్నుగా నిలబడి ముందుకు పోతున్న గొప్ప ఉమ్మడి కుటుంబం జిందగీ ఇమేజెస్ గ్రూప్.

చేగొండి చంద్రశేఖర్ ( చేగో )

జిందగీ ఇమేజెస్ అనే గ్రూపు ఇంత పెద్దగా సక్సెస్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఇది నేను వూహించని పరిణామం. చాలా ప్రౌడ్ గా ప్లస్ బాధ్యతగా ఫీలౌతున్నాను. ఇదొక ఆర్గనైజేషన్ గా కాదు ఒక పెద్ద మూమెంట్ అవడం ఖాయం అనుకుంటున్నాను. ఉగాండా నుండి కూడా కొందరు గ్రూపు సభ్యులు ఫోటోలు స్పెషల్ గా జిందగీ కోసం పంపించడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది. మనం ఏదైనా మంచి పనిని అంతే మంచి నమ్మకంతో మొదలు పెడతామో అది తప్పకుండా మహా సక్సెస్ అవుతుందని జిందగీ ఇమేజెస్ గ్రూప్ నిరూపించింది. చిన్న విత్తును నాటాను అది మహా వృక్షమైంది. ఒక వసుధైక కుటుంబంలా అల్లుకుపోయింది. ఇమేజ్ అనేది చిన్నవిషయం కాదు. అది ఒక గొప్ప శక్తి గలదని రూడీ అయింది. త్వరలోనే తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ తరపున జిందగీ ఫోటో ఎగ్జిబిషన్ పెడదామని సాంస్కృతిక శాఖా సంచాలకులు శ్రీ మామిడి హరిక్రిష్ణ గారు మాటివ్వడంతో నాకెంతో సంతోషం వేసింది. నిజంగా ఇదొక సంచలనం అని నేను భావిస్తున్నాను. ప్రొఫేషనల్ ఫోటోగ్రాఫర్ తీసింది ఫోటోనే కావచ్చు కానీ ప్రొఫేషనల్ ఫోటోగ్రాఫర్ కానివాడు తన జిందగీని చూపిస్తూ తీసే ఫోటోలో ఆత్మ వుంటుంది. అలాంటి ఆత్మను అల్లుకున్న ఆత్మ బంధువులు జిందగీ కుటుంబ సభ్యులు. ముందు ముందు కూడా మేమింకా ఎన్నో కార్యక్రమాలు చెయ్యాలి ఈ గ్రూపు నుండి. అతి త్వరలోనే మా ఈ గ్రూపు లక్ష సభ్యులకు చేరనుంది.

– సంఘీర్