దేశ వ్యాప్తంగా ఫుడ్ డెలివరీ రంగంలో సేవలందిస్తున్న జొమాటో సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. పలు నగరాల్లో తమ సేవలను నిలిపివేయాలని భావించింది. దీంతో ఆర్డర్లు తక్కువగా ఉన్న 225 చిన్న పట్టణాల్లో జొమాటో సేవలు ఆగిపోతున్నాయి. కంపెనీ మూడో త్రైమాసిక ఫలితాల విడుదల సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది. వ్యాపారం ఆపివేసిన నగరాల్లో గ్రాస్ ఆర్డర్ విలువ 0.3 శాతంగా ఉండడంతో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొంది. అయితే ఇంకా 225 నగరాల జాబితాను మాత్రం ప్రకటించలేదు.
జొమాటో మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకారం కంపెనీ ఆదాయం 75 శాతం పెరిగింది. నష్టాలు మాత్రం 450 పెరిగాయి. గతంలో నష్టాలు రూ.63 కోట్లు ఉండగా ఈసారి ఆక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో జొమాటో కంపెనీ రూ.346.6 కోట్ల నష్టాలను నమోదు చేసింది. దీనికి కారణంగా దేశ వ్యాప్తంగా ఉన్న 8 నగరాల్లో ఫుడ్ డెలివరీ రంగంలో వ్యాపారం మందకొడిగా సాగడమే అని జొమాటో తన నివేదికలో తెలిపింది. 8 నగరాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా వ్యాపారంలో మందగమనం చూస్తున్నట్లు వెల్లడించింది. గత కొన్ని త్రైమాసికాల్లో ఈ నగరాల్లో పనితీరు ఆశాజనకంగా లేకపోవడంతో ఖర్చులను తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. 225 నగరాల్లో జొమాటో సేవలు నిలిచిపోవడంతో ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి.