రోడ్డెక్కిన జొమాటో డెలివరీ బాయ్స్
ఆహార ప్రియులకు సకాలంలో రుచికరమైన ఆహారాన్ని అందించే జొమాటో డెలివరీ బాయ్స్ మళ్ళీ రోడెక్కారు. జొమాటో కంపెనీ తీసుకొని వచ్చిన కొత్త ఇన్సెంటివ్స్‌ను నిరసిస్తూ డెలివరీ బాయ్స్ ముంబై, బెంగళూరు నగరాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఇన్సెంటివ్ పద్దతి ప్రకారం గతంలో కంటే ఎక్కువ ఇన్సెంటివ్ ఇవ్వాల్సింది పోయి ఉన్నది కూడా తగ్గించడం వారి నిరసనకు ప్రధాన కారణం.
జొమాటో యాజమాన్యం ఖర్చులను క్రమబద్ధీకరించడానికి ప్రయత్నిస్తున్నందున ఈ వారంలో తమ డెలివరీ బాయ్స్ తగ్గవచ్చని రెస్టారెంట్లకు సమాచారం ఇవ్వడం ఈ వివాదాన్ని మరింత ఉదృతం చేసింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఇన్సెంటివ్స్ ప్రకారం జోమాటో డెలివరీ బాయ్స్‌కి 46 టచ్ పాయింట్లకు 850 రూపాయల ఇన్సెంటివ్ పొందుతారు, అంటే టచ్ పాయింట్‌కి రూ.18.6. ఇంతకుముందు ఇదే టచ్‌పాయింట్‌కు రూ.20 ఇచ్చింది. ఈ రేటు వీకెండ్స్‌కి మాత్రమే, అలాగే ప్రతి డెలివరీకి రెండు టచ్ పాయింట్ల లభిస్తాయి. మార్కెట్‌లో నిలబడాలంటే ఈ కోత తప్పదని జొమాటో యాజమాన్యం అంటోంది.