జొమాటో డ్రోన్లు వచ్చేస్తున్నాయ్.. ప్రయోగం సక్సెస్ - MicTv.in - Telugu News
mictv telugu

జొమాటో డ్రోన్లు వచ్చేస్తున్నాయ్.. ప్రయోగం సక్సెస్

June 12, 2019

జొమాటో, స్విగ్గీ.. పేర్లు వినని నగర జనం ఉండరు. ఆ కంపెనీల డెలివరీ బాయ్స్‌తో రోడ్లు కిటకిటలాడిపోతుంటాయి. కాస్తా ఆలస్యమైతే కస్టమర్లు తట్టుకోలేరు. కస్టమర్ల సంగతి పక్కన బెడితే ట్రాఫిక్ రద్దీ, గాలి కాలుష్యం, ఇంధన భారం వంటి చిక్కులెన్నో ఉన్నాయి.  అందుకే జొమాటో డ్రోన్లపై దృష్టి పెట్టింది. వాటి ద్వారా ఫుడ్ డెలివరీ చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా నిర్వహించిన ప్రయోగం విజయవంతమైందని కంపెనీ తెలిపింది.

 

ఓ డ్రోన్ ద్వారా ఫుడ్ ప్యాకెట్‌ను 5 కిలోమీటర్ల దూరంలోని గమ్యానికి కేవలం 10 నిమిషాల్లో చేరవేశామని, డ్రోన్ గంటలకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిదని జొమాటో వెల్లడించింది. టెక్‌ఈగల్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా ఇలాంటి డ్రోన్లను తీసుకొస్తున్నట్లు పేర్కొంది. హెలికాప్టర్ మాదిరి నిలువుగా ఎగిరి టేకాఫ్ తీసుకునే ఈ డ్రోన్ 5 కేజీల బరువును మోసుకెళ్లగలదు. దీన్ని ప్రయాణాన్ని నిపుణులు కంప్యూటర్ ద్వారా పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం జొమాటో బైకర్ ఫుడ్ డెలివరీ చేయడానికి సగటున అర గంట సమయం పడుతోంది. డ్రోన్ ద్వారా ఆ సమయాన్ని 10 నిమిషాలకు కుదించే అవకాశముంది. అయితే డ్రోన్ల వాడకంపై మన దేశంలో పలు ఆంక్షలు ఉండడంతో అవి ఎంతవరకు ఆచరణాత్మకమో వేచి చూడాల్సిందే.