ఆన్లైన్లో ఫుడ్ బుక్ చేస్తే ఇంటికే డెలివరీ చేసే సంస్థ జొమాటో కస్టమర్ల నుంచి భారీగా డబ్బు గుంజుతోంది. రెస్టారెంటులో నేరుగా వెళ్లి తిన్నదానికి, అవే ఐటమ్స్ జొమాటోలో తెప్పించుకుంటే చెల్లించిన బిల్లుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఓ కస్టమరు లింక్డ్ ఇన్లో షేర్ చేశాడు. దాదాపు 20 నుంచి 30 శాతం వరకు జొమాటో అధిక ధరలను నిర్ణయిస్తోందని ఆరోపించాడు. వివరాలు.. ముంబైకి చెందిన రాహుల కాబ్రా అనే కస్టమరు ద మోమో ఫ్యాక్టరీ అనే రెస్టారెంటు నుంచి వెజ్ బ్లాక్ పెప్పర్ సాస్, వెజ్ ఫ్రైడ్ రైస్, మష్రూమ్ మోమోలు ఆర్డర్ వేశాడు. దానికి జొమాటో వేసిన బిల్లు రూ. 690. అవే ఐటమ్స్ రెస్టారెంటుకు వెళ్లి తింటే అయ్యే ఖర్చు రూ. 512. ఈ వ్యత్యాసాన్ని పేర్కొంటూ రాహుల్ ‘రెస్టారెంట్లకు బిజినెస్ కల్పించేందుకు జొమాటో సాయం చేస్తుండవచ్చు. కానీ, ఇందుకోసం ఇంత ఎక్కువ చార్జ్ చేయాలా? అని ప్రశ్నించాడు. దానికి జొమాటో ‘కస్టమర్, రెస్టారెంటు మధ్య మేము కేవలం మధ్యవర్తులం మాత్రమే. అందులో పేర్కొనే ధరలకు మాకు సంబంధం ఉండదు’ అని బదులిచ్చింది. ఇది నిజమే కానీ, జొమాటో, స్విగ్గీలు డోర్ డెలివరీ చేసినందుకు రెస్టారెంట్ల నుంచి కమీషన్ వసూలు చేస్తుండడంతో ఆ మేరకు వారు అధిక ధరలు నిర్ణయిస్తున్నారు.