వెల్ కమ్ టూ జాంబీపురం - MicTv.in - Telugu News
mictv telugu

వెల్ కమ్ టూ జాంబీపురం

March 14, 2018

ఒక రోజంటూ వస్తుంది. ఆ రోజు జీవితమే మృత్యువులా వేటాడుతుంది. ఇంట్లో ఎదురుచూసే భార్యే మృత్యుదేవత అవుతుంది. గుండెల మీద కూర్చోని గడ్డంతో ఆడుకున్న కొడుకే పీక కొరకాలనుకుంటాడు. మెరిడియన్ లో మీతో పాటు మటన్ బిర్యానీ తిన్న దోస్తుగాడే, మీ మాంసాన్ని రుచి చూడాలనుకుంటాడు. అమ్మా,నాన్న, అక్కా,తమ్ముడూ, చెల్లి…ఈ బంధాలన్నీ గతించిన గతాలు. సమాధి అయిన అనుబంధాలే.  ఇండ్లన్నీ స్మశానాలు. నగరాలే బొందలగడ్డలు. ఎక్కడ చూసినా శవాల స్వైర విహారం. ప్రాణం లేని మనుషుల పైశాచిక ఆనందం. వెల్ కమ్ టూ జాంబీపురం. ఇది రక్తపిపాసుల లోకం.

రేపటి భయం

Image result for zombie

వన్ బ్యాడ్ మార్నింగ్. ఏదో జరిగింది. వాలిన పొద్దు  మళ్లీ పొడవడానికి భయపడింది. ప్రకృతితో పోటీపడుతున్న మనిషిని చూసి రాక్షసత్వమేదో ఓర్వలేకపోయింది. కసి తీరా పంజా విసిరింది. నలుదిక్కులా మృత్యువును మోహరించింది. న్యూఢిల్లీ టూ న్యూయార్క్, మాస్కో టూ మొజాంబిక్. ఎటు చూసినా నరమేధం. చెవులు చిల్లులు పడేలా ఆర్తనాదాలు. అగ్రరాజ్యమా ఆఫ్రికా కంట్రీనా అన్న తేడా లేదు. అంతటా రక్తం ఏరులై పారుతుంది. మనిషిని మనిషే చంపుతాడు. పిచ్చిపట్టినట్టుగా పీక్కుతింటాడు. చచ్చినవాడి అవయవాలతో ఆకలి తీర్చుకుంటాడు. భూమి కంటే నరకమే నయం అనిపిస్తుంది. ప్రభుత్వాల అతాపతా ఉండదు. మిలట్రీలకు ధైర్యం రాదు. ఏం జరిగిందో చెప్పడానికి సైన్స్ సాహసించదు. అంతా ఫినిష్.

Image result for zombie

ఏదో ఒక రోజు ఇలాంటి అంతానికి ఆరంభం మొదలవుతుంది. ఆ రోజు మనుషులు జాంబీల్లా మారుతారు. రక్తదాహంతో  అల్లాడుతారు. కనిపించిన ప్రతీ ఒక్కర్నీ ఖతం చేస్తారు. నరాలను కొరికి రక్తాన్ని జుర్రుకుంటారు. మనిషి చావుకు భయపడతాడు కావొచ్చు. కాని చచ్చిన శవాలే చంపాలనుకుంటే…………

జాంబీ అంటే క్రూరజంతువు కాదు. మనిషినే మృగంలా మార్చే వ్యాధి. మనిషి శరీరంలోకి జాంబీ వైరస్ ఎంటర్ అయిందంటే అతడు టెక్నికల్ గా చనిపోయినట్టే. అతడి శరీరం మనిషి లక్షణాలను కోల్పోతుంది. వైరస్ ఆధీనంలోకి పోతుంది. అది చెప్పినట్టు చేస్తుంది. తన అంతానికి తానే నాయకత్వం వహించేలా మనిషిని మార్చేస్తుంది. ఆ క్షణం నుంచే ఇంకొక మనిషిని జాంబీగా మార్చడానికి మనిషితోనే క్రూరమైన వేట మొదలుపెట్టిస్తుంది. కంటి ముందు కనిపించే ప్రతి జీవి ప్రాణం తీయిస్తుంది. అదంతా చూసి మృత్యువు కూడా జాంబీ దగ్గరకెళ్లడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంది. అది చేసే నరమేధాన్ని చూస్తే చావుకైనా ప్రాణాలపై ఆశ పుడుతుంది.

ఊహ కాదు వాస్తవంలా మారే నిజం?

Image result for zombie

జాంబీలు సినిమాల్లో ఉంటాయి. అందుకే అలాంటి “రేపు” అన్నది ఉండదని, రానేరాదని ఎవరైనా అనుకుంటే అది వాళ్ల భ్రమే. రేపటి వాస్తవాన్ని వర్తమానంలో ఊహించుకోవడానికి దమ్ము లేనివాళ్లే అలా అనుకుంటారు. మానవజాతిని అంతం చేయడానికి ప్రతీ శతాబ్దంలోనూ పంజా విసురుతున్న మృత్యువు, గతంలో సాధించిన ఘన విజయాలు తెలియనివాళ్లే అలా భావిస్తారు. అలాంటి వాళ్లంతా ఒక్కసారి చరిత్ర పేజీలను తిరిగేయాలి….

బ్లాక్ డెత్

Image result for yersinia

14 వ శతాబ్దంలో యూరప్ జనాభాలోమూడో వంతు మందిని  యెర్సినియా అనే బ్యాక్టీరియా చంపేసింది. సిల్క్ రూట్ లో ఆసియా నుంచి యూరప్ కు చేరిన ఆ బ్యాక్టీరియా రెండేళ్లలోనే ఎంతోమందిని పొట్టనపెట్టుకుంది. యూరప్ నుంచి మిగతా ప్రపంచానికి కూడా పాకి, మొత్తం మానవజాతినే సమూలంగా నాశనం చేస్తుందని అందరూ భయపడ్డారు. కాని ఏ దేవుడో అడ్డుపడి ఆ మారణహోమాన్ని ఆపాడు.

స్పానిష్ ఫ్లూ

Image result for swine flu

అమెరికా నుంచి ఆర్కిటిక్ అంచుల దాకా ఉన్న వాళ్లందర్నీ స్పానిష్ ఫ్లూ భయపెట్టింది. 1918 లో విజృంభించిన ఈ ఫ్లూ ప్రపంచవ్యాప్తంగా కోటిన్నర మందిని మింగింది. స్పానిష్ ఫ్లూ అరాచకాన్ని చూసి ప్రకృతికే పాపం అనిపించింది.  ఫ్లూ వైరస్ ను అడ్డుకునే మేథోశక్తిని మనిషికి ప్రసాదించింది. అప్పటి నుంచి ప్రతీ వందేళ్లకోసారి పంజావిసురుతున్న మృత్యువును సైన్స్ సహాయంతో మనిషి సమర్థవంతంగా అడ్డుకుంటున్నాడు. కాని ఈ సారి మాత్రం మనిషికి రోజులు దగ్గరపడ్డాయి. కౌంట్ డౌన్ మొదలైంది.

డిసీజ్ ఎక్స్(Disease X)

Related image

భవిష్యత్తులో మనుషులను ఇబ్బంది పెట్టే వ్యాధులు, వ్యాధికారకాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ R&D విభాగం 2015లో  ఒక లిస్ట్ రిలీజ్ చేసింది. క్రిమియన్-కాంగో హేమోరేజిక్ ఫీవర్ (CCHF);ఎబోలా వైరస్, మార్బర్గ్ వైరస్, లస్సా ఫీవర్, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనావైరస్ (MERS-CoV), సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (SARS); నిపా & హేనిపావైరల్ వ్యాధి, రిఫ్ట్ వ్యాలీ ఫీవర్ (RVF), జైకా వైరస్ లను ఆ లిస్ట్ లో చేర్చింది. ఇవి ఎప్పటికప్పుడు తమ తీవ్రతను పెంచుకుంటూ విజృంభిస్తాయని హెచ్చరించింది. అయితే వీటితో పాటు ఎలా ఉంటుందో, ఎలా వస్తుందో తెలియని ఒక వ్యాధిని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ లిస్ట్ లో చేర్చింది. అదే డిసీజ్ ఎక్స్.

Image result for Disease X

డిసీజ్ ఎక్స్ తో మానవజాతికి ముప్పు తప్పదని కొంతమంది సైంటిస్టులు భయపడుతున్నారు. ఇంకొందరైతే ఆ డిసీజ్ ఎక్స్ జాంబీ వైరసే అని బల్లగుద్ది మరీ చెపుతున్నారు. జాంబీ వైరస్ ఆల్ రెడీ భూమి మీద ఉందని, రేపోమాపో రూపం మార్చుకుని మనుషులపై విరుచుకుపడుతుందని అంటున్నారు.

రేబిసే జాంబీనా?

కుక్క కరిస్తే వచ్చే రేబిస్ వ్యాధికి జాంబీతో దగ్గరి పోలికలున్నాయి.. ఈ రెండు వ్యాధులు మనిషి మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఎలాంటి చికిత్స తీసుకోకుంటే కుక్క కరిచిన వారం లోపు లేదా మూడు నెలల్లో రేబిస్ రావచ్చు. కొందరిలో రెండు సంవత్సరాల తరువాత కూడా వ్యాధి లక్షణాలు బయటపడొచ్చు. రేబిస్ వచ్చినవారిలో జ్వరం, తలనొప్పి, నిద్రలేమి, గాబరా, అతి ఉత్సాహం, ఇతరులను చూసి భయపడి కరిచేయడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండు రోజుల్లోనే మనిషి చనిపోతాడు. ఒకవేళ బతికినా మెదడు దెబ్బతిని పిచ్చివాడవుతాడు.

Related image

రేబిస్ వైరస్ తో జాంబిలా మారడం కష్టం. కానీ అసాధ్యమేమి కాదని యూనివర్సిటీ ఆఫ్ మియామీ సైంటిస్టులు తేల్చారు. మోడ్రన్ జెనెటిక్ ఇంజినీరింగ్ తో రేబిస్ వైరస్ ను జాంబీలా మ్యూటేషన్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఇందుకోసం రేబిస్ వైరస్ లో కొన్ని మార్పులు చేస్తే చాలంటున్నారు.

మేకింగ్ ఆఫ్ జాంబీ

Related image

కరవడంతో మాత్రమే వచ్చే రేబిస్ కు గాలిలో వ్యాపించే లక్షణం రావడానికి దాన్ని ఫ్లూ వైరస్ తో కలపాలి. మనిషి శరీరంలో అనూహ్యమైన మార్పులు తీసుకురావడానికి మీజిల్స్ వైరస్ ను యాడ్ చేయాలి. విపరీతమైన జ్వరంతో మెదడును అల్లాడించడానికి ఎన్సెఫలైటిస్ వైరస్ ను కలపాలి. శరీరం నుంచి రక్తం కారడానికి ఈబోలా వైరస్ ను యాడ్ చేస్తే జాంబీ వైరస్ తయారవుతుందని మియామీ సైంటిస్టులు ఓ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.

ప్రకృతే కాపాడుతోందా?అయితే ఎప్పటిదాకా?

సైన్స్ ఎక్కడ నెగ్గినా, ప్రకృతి ముందు తగ్గే ఉంటుంది. జెనెటిక్ ఇంజనీరింగ్ లో సైన్స్ సాధించిన విజయాలతో మియామీ సైంటిస్టులు జాంబీ వైరస్ తయారీపై ఓ థియరీని అల్లారు. కాని ఈ భూమ్మీద ఏది జరిగినా ప్రకృతి నియమాల ప్రకారమే జరగాలన్న ఒకే ఒక్క ఈక్వేషన్ ఆ థియరీని ప్రాక్టికల్ కాకుండా ఆపుతోంది. ప్రస్తుతం ఈ భూమ్మీద ఉన్న  ఏ వైరస్ కూడా ఇంకో వైరస్ లక్షణాలను సొంతం చేసుకోలేదు. బతికి ఉన్నన్ని రోజులు అంది సొంత లక్షణాలతోనే ఉంటుంది. ఇందుకు దాని బయోలాజికల్ నిర్మాణంలోని సంక్లిష్టతే కారణం. ఈ లక్షణమే జాంబీ వైరస్ పుట్టుకను నిరోధిస్తోంది. అయితే ఎన్ని రోజులు? మనిషిపై ప్రకృతి ఎన్ని రోజులు జాలి చూపిస్తుంది? అన్నదే అసలు ప్రశ్న

జాంబీ దాడులు  

2012 మే 26న జాంబీ తరహా దాడిని ప్రపంచం చూసింది.. అమెరికాలోని మియామీలో రూడీ యూజీన్ అనే వ్యక్తి రోడ్డుపై నగ్నంగా వెళుతూ ఒక బిచ్చగాడిపై దాడి చేశాడు.. అతడి ముఖాన్ని ఇష్టం వచ్చినట్టు కొరికి ముక్కు, కళ్లను తిన్నాడు. ఈ సంఘటన అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.

దాడి గురించి తెలిసి స్పాట్ కొచ్చిన పోలీసులు, వదిలేయాలని యూజీన్ ను హెచ్చరించారు. ఆ వార్నింగ్ లను  యూజీన్ పట్టించుకోలేదు. దీంతో అతణ్ని పోలీసులు కాల్చేశారు. రెండు రౌండ్ల బుల్లెట్లు శరీరంలో దిగినా యూజిన్ పట్టువదల్లేదు. దీంతో డైరెక్ట్ గా యూజీన్ తలలోకే బుల్లెట్లు దించారు. అప్పుడే అతడు కుప్పకూలాడు.

యూజీన్ చేసిన దాడితో జాంబీలపై చర్చ మొదలైంది. జాంబీ అవడంతోనే యూజిన్ అలా ప్రవర్తించాడని కొందరు అనుమానించారు. కానీ పోలీసులు వీటిని కొట్టిపారేశారు.. డ్రగ్ ఎఫెక్ట్ తోనే యూజీన్ అలా చేసి ఉండొచ్చన్నారు.. ఎందుకంటే చీప్ గా దొరికే సింథటిక్ డ్రగ్ వాడితే మనిషి క్రూరంగా ప్రవర్తిస్తాడు. పిచ్చిపట్టినట్టు ఇతరులపై దాడి చేసి కొరికేస్తాడు. యూజీన్ అలాంటివి వాడి ఉంటాడని అనుకున్నారు. కానీ మియామీ పోలీసుల వాదనను సెంటర్ ఫర్ డిసీజ్ అండ్ ప్రివెన్షన్ కొట్టిపారేసింది. యూజీన్ రక్తంలో ఎలాంటి డ్రగ్స్ అవశేషాలు లేవంది.. దీంతో పాటే మరో షాకింగ్ న్యూస్ నూ బయటపెట్టింది.

యూజీన్ శరీరంలో కొత్త వైరస్ ను సీడీసీ సైంటిస్టులు తెలుసుకున్నారు. ఇప్పటిదాకా ఉన్న వైరస్ ల కంటే భిన్నంగా దాని నిర్మాణం ఉంది.. ఎల్.క్యూ.పి. 79 అని పేరు పెట్టిన సీడీసీ సైంటిస్టులు దానికి రేబిస్ తో పాటు మరికొన్ని వైరస్ ల లక్షణాలున్నట్టు గుర్తించారు. ఇంకా చెప్పాలంటే ఎల్.క్యూ.పి 79 జాంబీ వైరస్ అయ్యే అవకాశం ఉందన్నారు.

Related image

మియామీ దాడి తరువాత చైనాలోనూ అలాంటిదే ఇంకో సంఘటన జరిగింది.. రోడ్డుపై వెళుతున్న మహిళపై బస్సు డ్రైవర్ దాడి చేసి కొరికేశాడు. దీంతో పాటు యూరప్, ఆఫ్రికా, అమెరికాలలో మరికొన్ని సంఘటనలు జరిగాయి.. ఇవన్నీ ఎందుకు జరిగాయో సైంటిస్టులకు అర్థం కాలేదు.. ఏదైనా వైరస్ ప్రభావంతోనే వాళ్లలా ప్రవర్తించారా అన్నదానిపై పరిశోధనలు చేస్తున్నారు.

మియామీలో జాంబీ అటాక్ చేసిన యూజీన్ శరీరంలోనే ఎల్.క్యూ.పీ వైరస్ ను సైంటిస్టులు కనుకున్నారు. కానీ మిగతా దాడుల్లో వాళ్లకు సరైన పరీక్షలు జరగలేదని సీడీసీ భావించింది. కానీ అంత్రాక్స్ ను తయారుచేసిన అమెరికాలోని కొన్ని బయో కంపెనీలే జాంబీ తయారీకి ప్రయత్నిస్తున్నాయన్న అనుమానాలున్నాయి.బయోవార్ లో భాగంగా అమెరికా కూడా ఆ పరిశోధనలకు సాయం చేస్తోందన్న ఆరోపణలున్నాయి.

ఎవరూ కోరుకోని ముగింపు

ప్రతీ ఆరంభం అంతం అవుతుంది. వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కుప్పకూలుతుంది.. వేల ఏళ్ల నాగరికత ముగియడానికైనా ఒక్కరోజు చాలు. అందుకే మానవజాతి ప్రస్థానంలో చావు ఒక్కటే నిజంలా కొనసాగుతోంది. మనిషిని అంతం చేసేందుకు ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట “చావు” కాపుకాసి ఉండొచ్చు. సరైన సమయం కోసం వేచి చూస్తుండొచ్చు. అది జాంబీ కావొచ్చు. బీ రెడీ…